దేశ ప్రథమ పౌరురాలిగా ఆదివాసీ మహిళ

దేశ ప్రథమ పౌరురాలిగా ఆదివాసీ మహిళ

భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మూడో రౌండు కౌంటింగ్ పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ము 50శాతానికి పైగా ఓట్లు సాధించారు. దీంతో ఆమె విజయం లాంఛనమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము ప్రతి రౌండ్ లోనూ  ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మూడో రౌండు పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్లురాగా..  యశ్వంత్ సిన్హాకు 2,61,062 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో దిగారు. ఈ నెల 18న ఓటింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు హౌస్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత ఎంపీల ఓట్లు లెక్కించగా.. తొలి రౌండ్లోనే ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోయారు. మొత్తం 763 మంది ఎంపీలు ఓటు వేయగా వారిలో 15 మంది ఓట్లు చెల్లలేదు.  మిగిలిన 748 ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు వచ్చాయని వాటి విలువ 3,78,000 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించారు. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు రాగా వాటి విలువ 1,45,600గా లెక్కించారు.

అనంతరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించగా రెండో రౌండ్ లోనూ ద్రౌపది ముర్ము దూసుకుపోయారు. సెకండ్ రౌండ్ లో 10 రాష్ట్రాలకు చెందిన 1138 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో  ద్రౌపది ముర్ముకు 1,05,299  విలువైన 809 ఓట్లు పోలైనట్లు రాజ్యసభ సెక్రటరీ పీసీ మోడీ తెలిపారు. సెకండ్ రౌండ్ లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేవలం  329 ఓట్లు  మాత్రమే దక్కాయి. ఆయనకు వచ్చిన ఓట్ల విలువ 44,276. ఎంపీలు, 10 రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కలుపుకొని చెల్లుబాటైన 1,886 ఓట్ల విలువ 6,73,175 కాగా.. వాటిలో 1,349 ఓట్లు ద్రౌపది ముర్ము ఖాతాలో పడ్డాయి. వాటి విలువ 4,83,299. ఇక సెకండ్ రౌండ్ ముగిసే సరికి యశ్వంత్ సిన్హాకు 1,89,876 విలువైన 537 ఓట్లు మాత్రమే పడ్డాయి.

మూడో రౌండులో కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించారు. 1,333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో ద్రౌపది ముర్ముకు 812 , విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి.