నీతికథ : అవసరార్థం అసత్యం పలుకవచ్చు.. ధర్మ సూక్ష్మం.. ధర్మశాస్త్రం చెప్పేది ఇదే..!

నీతికథ : అవసరార్థం అసత్యం పలుకవచ్చు.. ధర్మ సూక్ష్మం.. ధర్మశాస్త్రం చెప్పేది ఇదే..!

సత్యం పలకాలి అని భారతీయ ధర్మశాస్త్రం చెబుతోంది.అవసరార్థం అసత్యం పలకవచ్చని, అది ధర్మసూక్ష్మమని ధర్మశాస్త్రమే చెబుతోంది. 

వారిజాక్షులందు వైవాహికము లందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప!

ఓ బలిచక్రవర్తీ! ఆడవారికి, పెండ్లికి సంబంధించిన విషయాల్లో, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు, భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడేటప్పుడు.. అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల పాపం రాదు... అని బలిచక్రవర్తికి రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్పినట్లు మనకు పోతన భాగవతం చెబుతోంది.

‘ఓ బలి చక్రవర్తీ! ఇప్పుడు దానం కోరటానికి వచ్చినవాడు సామాన్యుడు కాదు. వామన రూపంలో ఉన్న విష్ణువు. మూడు అడుగుల నేల అడుగుతున్నాడు. ఆ మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించేస్తాడని గ్రహించు. అంతేనా.. నీ ప్రాణాలు, సంపదలు, మానం సమస్తం అపహరించేస్తాడు. ఇటువంటి సమయంలో అబద్ధం చెప్పినా పాపం రాదు. అందుచేత వామనుని కోరికను నిర్భయంగా తిరస్కరించు’ అని పలికే సందర్భంలో ఈ మాటలు శుక్రాచార్యుడు పలికాడు.

ఒక చిన్న కథను పరిశీలిద్దాం...

అనగనగా ఒక మహర్షి ఉన్నాడు. ఆయన దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి తనను ఎవరో తరుముతుంటే పరుగెత్తుకుంటూ వచ్చి ఆ మహర్షి వెనుక దాగున్నాడు. ఇంతలో ఆ తరుముతున్న వ్యక్తి అక్కడికి వచ్చి, ‘అయ్యా! ఇటువైపుగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడా’ అని ప్రశ్నించాడు.

 మహర్షికి ధర్మసంకటం ఎదురైంది. తన వెనుకే ఉన్నాడనే నిజం చెబితే, తన వెనుక ఉన్న వ్యక్తి మరణిస్తాడు. అలాగని ఆ వ్యక్తి ఇటు వైపు రాలేదని చెబితే, అసత్య దోషం కలుగుతుంది. తనకు ఏ దోషమూ రాకుండా ఉండాలంటే ఎలా మాట్లాడాలా అని కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు. తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ‘నాయనా! నువ్వు ఇటువైపుగా ఎవరైనా వచ్చారా అని నన్ను అడుగుతున్నావు. వచ్చిన వ్యక్తిని నా కళ్లు చూస్తాయి. కానీ కళ్లు మాట్లాడలేవు. నోరు చూడలేదు, కానీ నోరు మాట్లాడగలదు. 

కాబట్టి నేను ఏమీ పలుకలేను’ అని జాగ్రత్తగా ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని అనుసరించి, తనకు అసత్య దోషం రాకుండా మాట్లాడాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రాణానికి అపాయం కలిగే సందర్భం కనుక, మహర్షి ఆ విధంగా, నొప్పించక, తానొవ్వక అన్న రీతిలో హుందాగా ప్రవర్తించాడు.

పారిజాతాపహరణం ఘట్టం పరిశీలిద్దాం...

ఇంద్రుడి నందనవనం నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి, రుక్మిణికి సమర్పించాడు శ్రీకృష్ణుడు. ఆ విషయాన్ని గమనించిన సత్యభామ ఇష్టసఖి, జరిగిన దానికి రెండింతలు కలిపి సత్యభామకు చెప్పి, ఆమెలో పౌరుషం రేకెత్తించింది. విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు, సత్యభామ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో సత్యభామ కోపంతో శయ్య మీద నిద్ర నటిస్తూ ఉంది.

 శ్రీకృష్ణుడు ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆమెను శాంతపరచటం కోసం ప్రయత్నించాడు. కోపంలో సత్యభామ శ్రీకృష్ణుని శిరసు మీద తన పాదంతో తొలగతోసింది. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతంగా, ‘దేవీ, నా శిరస్సు తగిలిన నీ సుకుమార పాదాలకు గాయం కలిగిందేమో’ అని నర్మగర్భంగా పలికాడు. అంతే సత్యభామకు కోపం మటుమాయమైంది. వారిజాక్షులు అంటే స్త్రీల విషయంలో ఇటువంటి చిన్న చిన్న మర్మాలు తప్పవని పోతన చెబుతున్నాడు. సత్యం తీరిగ్గా సింగారించుకొని బయటపడేసరికి, అసత్యం ప్రపంచమంతా పెత్తనాలు ముగించి తిరిగొస్తుందని సామెత ఉంది. కాబట్టి అబద్ధాలకు చెల్లుబాటు ఎక్కువ. 

మహాభారతం పరిశీలిద్దాం...

ధర్మరాజు పేరులోనే ధర్మం నిండి ఉంది. ఏనాడూ అసత్యం పలుకనివాడు, ధర్మాన్ని అతిక్రమించనివాడు. అంతటి మహానుభావుడు అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువుకి చేరి, ‘మహారాజా! నా పేరు కంకుభట్టు. గతంలో నేను ధర్మరాజు కొలువులో ఆయనకు వినోదం కలిగించడం కోసం ఆయనతో చదరంగం ఆడేవాడిని. మీకు అభ్యంతరం లేకపోతే, కొంతకాలం మీ కొలువులో ఉండి, మీకు వినోదం కలిగిస్తుంటాను’ అని పలికాడు.

 ప్రాణాలను కాపాడుకోవడానికి పలికిన మాటలకు అసత్యదోషం అంటదని ‘ప్రాణవిత్తమాన భంగమందు’ అనే మాటలను బట్టి తెలుస్తోంది. ధర్మరాజు ధర్మాన్ని అతిక్రమించకుండా, ధర్మసూక్ష్మాన్ని అనుసరించి ఈ మాటలను పలికాడు.

- డా. పురాణపండ వైజయంతి-