
- డ్రగ్స్ కు బానిసై యువకుడి మృతి
- రాష్ట్రంలో ఇదే మొదటి డ్రగ్ డెత్
- మార్చి 19న నిమ్స్ లో చేరిక.. 29న డెడ్
- డ్రగ్ సప్లయర్, ముగ్గురు కస్టమర్ల అరెస్టు
- మరో సప్లయర్ కోసం గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కు బానిసై హైదరాబాద్ కు చెందిన యువకుడు (23) మృతి చెందాడు. వివిధ రకాల డ్రగ్స్ ఎక్కువ మొత్తంలో వినియోగించడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడు.. నిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. రాష్ట్రంలో మొట్టమొదటి డ్రగ్ డెత్ ఇదే. ఈ కేసులో డ్రగ్ సప్లయర్, ముగ్గురు కస్టమర్లను నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ గురువారం అరెస్టు చేసింది. వారి నుంచి 6 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్,10 ఎక్స్టసీ పిల్స్,100 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకుంది.
ఈ కేసు వివరాలను నార్కోటిక్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలిసి అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన ప్రేమ్ ఉపాధ్యాయ (27), బాధితుడు (23) బీటెక్ పూర్తి చేశారు. వీరిద్దరూ మరికొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి తరచూ గోవాకు వెళ్తుండేవారు. అందరూ డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఎల్‌ఎస్‌డీ, ఎక్సటసీ, కొకైన్ లాంటి డ్రగ్ పిల్స్ వాడకంతో పాటు అమ్మడం ప్రారంభించారు. ఏడాదిగా డ్రగ్స్, హాష్ ఆయిల్ సప్లయ్ చేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో మళ్లీ గోవా వెళ్లేవారు. ఈ క్రమంలోనే బాధితుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకునేవాడు. డబ్బుల కోసం డ్రగ్స్ సప్లయ్ చేస్తూ గతంలో ఒకసారి పోలీసులకు కూడా చిక్కాడు.
మల్టీపుల్ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడంతో...
మార్చి మొదటి వారంలో అనారోగ్యానికి గురైన బాధితుడిని.. కుటుంబ సభ్యులు మార్చి19న నిమ్స్‌లో చేర్పించారు. మల్టీపుల్ డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఆరోగ్యం క్షీణించిందని, స్ల్కెరోసిస్ తో బాధపడుతున్నాడని డాక్టర్లు గుర్తించారు. ట్రీట్మెంట్ ఇచ్చినా ఆరోగ్యం మెరుగవక మార్చి 29న చనిపోయాడు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. నల్లకుంట కూరగాయల మార్కెట్లో డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు వచ్చిన ప్రేమ్ ఉపాధ్యాయను గురువారం అదుపులోకి తీసుకునివివరాలు రాబట్టారు. ప్రేమ్, బాధితుడు కలిసి గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చేవారని ఆధారాలు సేకరించారు. సప్లయర్ లక్ష్మీపతి వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసి అమ్మేవారని గుర్తించారు. ఈ సమాచారంతో కొండాపూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ(27), నార్సింగికి చెందిన గిటార్ టీచర్ నిఖిల్ జోషూ(27), తార్నాకకు చెందిన బీటెక్ స్టూడెంట్ జీవన్ రెడ్డి(26)లను అరెస్ట్ చేశారు. లక్ష్మీపతి కోసం గాలిస్తున్నారు.
యూట్యూబ్ లో చూసి డ్రగ్ తయారీ.. ఇద్దరి అరెస్టు
యూట్యూబ్‌లో చూసి డ్రగ్ తయారు చేస్తున్న పెడ్లర్ గుట్టురట్టయింది. తయారీదారు కె.శ్రీరామ్ (25), కస్టమర్ ఎస్.దీపక్‌కుమార్ జాదవ్(29)ను నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ గురువారం అరెస్టు చేసింది. 8 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకుంది. సూర్యాపేటకు చెందిన శ్రీరామ్ కొండాపూర్‌లో ఉంటున్నాడు. గోవా, ముంబై తదితర టూరిస్ట్ ప్లేసులకు వెళ్లేవాడు. అక్కడ డ్రగ్స్‌కు డిమాండ్ ఉందని సొంతంగా తయారు చేయాలనుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి కావాల్సినవి ఆన్ లైన్లో కొనుగోలు చేశాడు. మనిషి శరీరంపై ప్రభావం చూపే డై మెథైల్ ట్రిప్టోమైన్ డ్రగ్‌ను రూమ్‌లోనే తయారు చేశాడు. ఒక్కో గ్రామును రూ.8 వేల వరకు అమ్మాడు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ 6 నెలలుగా దందా కొనసాగించాడు.