ఫ్రీ కరెంట్ 10 గంటలే!

ఫ్రీ కరెంట్ 10 గంటలే!

‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత  త్రీఫేజ్​ కరెంట్ సరఫరా’ అంటూ రాష్ట్ర  ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉట్టివేనని, 10 నుంచి 12 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని మెదక్​ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంటలన్నీ ఎండిపోకతప్పదని వాపోతున్నారు.

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో  ఎక్కువ మంది రైతులు బోర్ల కిందే పంటలు సాగు చేస్తున్నారు. 21 మండలాల పరిధిలో లక్షకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వాటికింద దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మెజారిటీ రైతులు వరి పంటనే సాగు చేస్తారు. ఈ వానాకాలంలో బోర్ల కింద పూర్తిస్థాయిలో పంటలు సాగయ్యాయి. అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో త్రీఫేజ్​ కరెంట్​ సరఫరా అయితేనే బోర్ల కింద సాగు చేసిన పంటలకు సరిపడ నీళ్లు అందుతాయి. కానీ రెండు నెలలుగా త్రీఫేజ్​ కరెంట్​ సరఫరాలో కోత అమలవుతోంది. ఒకటి, రెండు గంటలు కాదు ఏకంగా రోజులో 11 గంటలు కోతలు విధిస్తున్నారు.  కొన్ని ప్రాంతాల్లో పొద్దున ఉదయం 5 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే త్రీఫేజ్​ కరెంట్​సరఫరా అవుతోంది. మొత్తానికి 10 నుంచి 12 గంటలు మాత్రమే త్రీఫేజ్​ కరెంట్​ ఇస్తున్నారు. అప్పుడప్పుడు లైన్​ ట్రిప్, బ్రేక్​ డౌన్​ పేరుతో గంట, రెండు గంటలు సరఫరా ఉండటం లేదు.  దీంతో బోర్ల కింద సాగు చేసిన పంటలకు సరిపడ నీటిని అందించలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట దెబ్బతిని నష్టపోక తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల శివ్వంపేట మండలం చెన్నాపూర్​లో కోతలు లేకుండా త్రీఫేజ్​ కరెంట్​సరఫరా చేయాలంటూ రైతులు సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వ్యవసాయానికి కోతలేకుండా త్రీఫేజ్​ కరెంట్​ సరఫరా చేయాలని కోరుతున్నారు. 

త్రీఫేజ్ ​10 గంటలే వస్తోంది 
సర్కారు త్రీఫేజ్​ కరెంట్​ 24 గంటలు ఇస్తుందని బోర్ల కింద వరి నాట్లు వేసినం. తీరా ఇప్పుడు కరెంట్ కోత మొదలయింది. నెల నుంచి రోజుకు 10 గంటలే త్రీఫేజ్​ కరెంట్​ ఇస్తున్రు. ఇట్లయితే పంటలు దెబ్బతినుడు ఖాయం. అందుకు రోజంతా త్రీఫేజ్​ కరెంట్​ఇచ్చేలా చూడాలె.  - శ్రీనివాస్​, రైతు, శివ్వంపేట

రోజూ 12 గంటలు ఇస్తున్నం.. 
వ్యవసాయానికి రోజూ 12 గంటలు కంటిన్యూగా త్రీఫేజ్​ కరెంట్​ సరఫరా చేస్తున్నం. టెక్నికల్​ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంత సేపు కరెంట్​ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. 
- ‌‌‌‌‌‌‌‌దుర్గా ప్రసాద్​, ట్రాన్స్​ కో ఏఈ, శివ్వంపేట