
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడికి డీఎస్సీ అభ్యర్థుల యత్నం
- ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
- బైఠాయించిన అభ్యర్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- కేసులు పెడ్తామంటూ బెదిరింపులు
- 13,500 పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెగా డీఎస్సీ వేయాలని కోరుతూ నిరుద్యోగులు చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులపై లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. 13,500 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఆ మేరకు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈడీ, బీఈడీ, ఆర్ట్ అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ముందుగానే డైరెక్టరేట్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డిని సిద్దిపేట వద్ద బస్సులో అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓయూతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినోళ్లను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే బషీర్ బాగ్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులను అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాళ్లను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇదే సమయంలో కొందరు పోలీసులు అభ్యర్థులపై లాఠీచార్జ్ చేశారు. అభ్యర్థులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. కేసులు పెడ్తామని, జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం వారందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా అభ్యర్థులు ఆందోళన కొనసాగించారు.
కాలేజీల బంద్‌కు పిలుపు..
అభ్యర్థులు ఆందోళన కొనసాగించడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కలిపిస్తామని పోలీసులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. పోలీస్ స్టేషన్లో అభ్యర్థులను కలిసేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను పోలీసులు లోపలికి అనుమతించలేదు. కాగా, అరెస్టులకు నిరసనగా బుధ, గురువారాల్లో బీఈడీ, డీఈడీ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు.
13,500 పోస్టులు భర్తీ చేయాల్సిందే..
సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు 13,500 పోస్టులను భర్తీ చేయాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు హరీశ్, కేశవులు, కోటేశ్ డిమాండ్ చేశారు. ‘‘13,500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. కానీ 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 5 లక్షల మంది అభ్యర్థులుంటే, 5 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామనడం సరికాదు. మూడేండ్ల కింద 16 వేల మంది విద్యావాలంటీర్లు పని చేశారు. ఆయా స్థానాలన్నీ ఖాళీలే. వచ్చే ఏడాది రిటైర్డ్ అయ్యే స్థానాలనూ ఇప్పుడే ఖాళీలుగా చూపించి భర్తీ చేయాలి” అని డిమాండ్ చేశారు. ఏండ్ల నుంచి భర్తీ చేయకుండా పెట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులనూ భర్తీ చేయాలని కోరారు. సర్కార్ స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మీడియాపై పోలీసుల జులుం..
నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అసెంబ్లీ వద్ద న్యూస్ కవరేజీకి వెళ్లిన పలువురు మీడియా ప్రతినిధులను డీసీపీ వెంకటేశ్వర్లు తోసేసి దురుసుగా ప్రవర్తించారు. కేసులు పెడ్తామని, అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కాగా, డీసీపీ తీరును హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్ ఖండించారు. మీడియా ప్రతినిధులు తమ విధులు నిర్వహిస్తుంటే అడ్డుకుని కేసులు పెడ్తామని, అరెస్టు చేస్తామని దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. డీసీపీ తీరుపై సీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డీసీపీ గతంలోనూ పలుమార్లు ఇదే విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.