గర్ల్స్​ను కొట్టి బూతులు తిట్టిన విద్యాధికారి

గర్ల్స్​ను కొట్టి బూతులు తిట్టిన విద్యాధికారి
  • యాక్షన్​ తీసుకోవాలంటూ స్టూడెంట్ల ధర్నా

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల డీటీడీవో జనార్ధన్​మద్యం మత్తులో క్లాస్​ రూంలోకి రావడమే కాకుండా బూతులు తిడుతూ కొట్టాడని సాయికుంటలోని ట్రైబల్​ వెల్ఫేర్​ గర్ల్స్​ రెసిడెన్షియల్​ స్కూల్​ స్టూడెంట్లు ఆరోపించారు. తమపట్ల దురుసుగా ప్రవర్తించిన డిస్ట్రిక్ట్​ ట్రైబల్ ​డెవలప్​మెంట్​ ఆఫీసర్(డీటీడీవో)​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్​ఆవరణలో ధర్నా చేశారు. ఈ నెల 11న సాయంత్రం 6.30 గంటల సమయంలో డీటీడీవో జనార్ధన్​ టెన్త్​ మ్యాథ్స్​ క్లాస్​రూంలోకి వచ్చారని, మద్యం మత్తులో ఉన్న ఆయన తలుపులు, కిటికీలు మూసి తమను అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా కొట్టాడని స్టూడెంట్లు చెప్పారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడన్నారు. రాత్రి 8 గంటలవుతుండడంతో భోజనం చేస్తామని అడిగితే ఒక్కపూట తినకుంటే చస్తారా అంటూ భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. ఉన్నతాధికారి అనే విషయాన్ని మర్చిపోయి స్టూడెంట్లతో అసభ్యంగా, పోకిరిలాగా ప్రవర్తించిన డీటీడీవోను సస్పెండ్​ చేయాలని ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​రంజిత్​ డిమాండ్​ చేశారు. టౌన్​ సీఐ నారాయణ నాయక్​ ఫోన్​లో ఐటీడీఏ పీవో దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎంక్వైరీ చేసి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ధర్నా విరమించారు. స్టూడెంట్ల ఫిర్యాదు మేరకు డీటీడీవోపై కేసు ఫైల్​చేసినట్టు సీఐ చెప్పారు.