
- కరీంనగర్ కార్పొరేషన్లో అడుగడుగునా అక్రమ నిర్మాణాలే
- లీడర్ల అండదండలతోనే అక్రమ కట్టడాలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంపై జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో గుర్తించిన అక్రమ కట్టడాలను జిల్లా టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) ఆధ్వర్యంలో కూల్చి వేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై డీటీఎఫ్ నిర్లక్ష్యం వహిస్తోందని, పేద, మధ్యతరగతి వారి నిర్మాణాలు కూల్చుతారే తప్ప బడా బాబుల జోలికి పోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దర్జాగా కడుతున్నరు
కరీంనగర్ కార్పొరేషన్ లో విలీన గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా వెలుస్తున్నాయి. తీగలగుట్టపల్లి ఏరియాలో వెంచర్ రోడ్ 30 ఫీట్లలో దర్జాగా కబ్జా చేసి నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇది అక్రమ నిర్మాణమని కొన్ని నెలల కిందే జిల్లా టాస్క్ ఫోర్స్ కు తెలిసింది. అయినా ఏ ఒక్క టౌన్ ప్లానింగ్ అధికారి, కార్పొరేషన్సిబ్బంది అడ్డుకున్న దాఖలాలు లేవు. సివిల్ హాస్పిటల్ శర్మ నగర్ ఏరియాలో ఓ భవనాన్ని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, సెల్లార్ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ అనుమతులు రద్దు చేశారు. డీటీఎఫ్ టీమ్ బిల్డింగ్ కూల్చేందుకు పోయి వెనక్కి వచ్చారు. ఈ విషయంలో అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఇలా సిటీలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు పోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ ఎలాంటి అనుమతులు లేకుండా భగత్ నగర్ ఏరియాలో కమాన్లు నిర్మించాడు. ఈ నిర్మాణాలపై కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చి 20 రోజులు దాటింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
అక్రమాల వెనక అధికార పార్టీ లీడర్లు..
చాలా డివిజన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల వెనక అధికార పార్టీ లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే వాటిని కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టడం షరా మాములుగా మారింది. అక్రమార్కులు, భూకబ్జాదారులకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటున్నాయి. అక్రమంగా చేపట్టిన నిర్మాణాల మీద సిటీ వాసులు, స్వచ్ఛంద సంస్థలు, ఏకంగా అధికార పార్టీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేసినా చర్యలు ఉండటం లేదు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన వాటిని సైతం డీటీఎఫ్ టీమ్ పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. డీటీఎఫ్ టీమ్ కు 45 అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయినా ఆ నిర్మాణాలను కూల్చడం లేదు. కార్పొరేషన్ లో అధికారం ఉన్న వారిదే రాజ్యంగా మారింది. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి డీటీఎఫ్ అధికారులు వెళితే వెంటనే పై నుంచి ఫోన్లు రావడంతో వెనక్కి వస్తున్న ఘటనలూ ఉన్నాయి. కలెక్టర్ చొరవ తీసుకుని డీటీఎఫ్ పనితీరును ఇప్పటికైనా మెరుగుపర్చాలని, లేకపోతే సిటీలో విలువైన భూములు కబ్జాల పాలవుతాయని సిటీవాసులు అంటున్నారు.
అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం:
సిటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తాం. ఇప్పటికే జిల్లా టాస్క్ ఫోర్స్ కు లిస్టు అప్పగించాం. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యుత్శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.
- సుభాష్, డీసీపీ, కరీంనగర్ కార్పొరేషన్