
న్యూఢిల్లీ: ఢిల్లీ-దుబాయ్ విమానానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ఐజీఐ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానానికి 2024, జూన్ 18వ తేదీ మంగళవారం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(DIAL) ఆఫీస్ కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి విమానంలో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించామని.. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు చెప్పారు. తనిఖీ చేసిన తర్వాత బాంబు బెదిరింపు.. బూటకమని తెలిపారు. అయితే, బెదిరింపు మెయిల్ ఎవరు చేశారని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రెండు వారాల క్రితం ఎయిర్ కెనడా టొరంటోకి వెళ్లే విమానంలో బాంబు అమర్చినట్లు బెదిరింపు ఇమెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ-టొరంటో ఎయిర్ కెనడా విమానంలో బాంబు అమర్చినట్లు ఇమెయిల్ రావడంతో తనిఖీ చేసిన అధికారులు బూటకమని తేల్చారు.
తర్వాత, ఢిల్లీ విమానాశ్రయానికి తప్పుడు బాంబు బెదిరింపు ఇమెయిల్ వెనుక 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించారు. సదరు బాలుడు కేవలం వినోదం కోసం మెయిన్‌ని పంపినట్లు అధికారులు తెలిపారు.