నన్ను విల్లాలో బంధించారు..వీడియో రిలీజ్ చేసిన దుబాయ్ రాజు కూతురు

నన్ను విల్లాలో బంధించారు..వీడియో రిలీజ్ చేసిన దుబాయ్ రాజు కూతురు

దుబాయ్: ‘‘నన్ను విల్లాలో బంధించారు. నాకు స్వేచ్ఛ లేదు” అంటూ దుబాయ్  రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ కూతురు షేక్​ లతీఫా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఈ విల్లాను జైలుగా మార్చారు. బయటకు కూడా రానివ్వడం లేదు. ఈ వీడియోను బాత్‌‌రూం నుంచి తీస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మాత్రమే నాకు లాక్ చేసుకునే అవకాశం ఉంది. అన్ని కిటికీలను మూసేశారు” అని ఆమె వాపోయారు. తాను స్వేచ్ఛగా బతకాలని అనుకుంటున్నానని చెప్పారు. ఈ వీడియోను బీబీసీ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ప్రోగ్రామ్ ‘పనోరమా’ పబ్లిష్ చేసింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారనేది తెలియరాలేదు. ఈ వీడియోపై దుబాయ్ ప్రభుత్వ మీడియా ఆఫీస్ కూడా స్పందించలేదు.

2018లో పారిపోయిన లతీఫా

లతీఫా 2002లోనే దుబాయ్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. తనకు స్వేచ్ఛగా బతకాలని ఉందని గతంలో ఆమె చెప్పారు. అయితే తన తండ్రి తనను బయటకు పంపేవారు కాదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ నుంచి పారిపోయి స్వేచ్ఛగా బతకాలని 2018లో లతీఫా ప్రయత్నించారు. ఓ ఫ్రెండ్ సాయంతో ఓ షిప్‌‌లో తప్పించుకున్నారు. కానీ ఆ షిప్‌‌ను ఆఫీసర్లు గుర్తించి లతీఫాను తిరిగి దుబాయ్​కి చేర్చారు. ఇక అప్పటి నుంచి లతీఫా గురించిన సమాచారం బయటికి రాలేదు. తాజాగా వీడియో రిలీజ్ చేయడంతో లతీఫా పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ‘ఫ్రీ లతీఫా క్యాంపెయిన్’ నిర్వహిస్తున్న వారే రహస్యంగా ఓ ఫోన్‌‌ను విల్లాలోకి పంపినట్టు తెలుస్తోంది. లతీఫాను వెంటనే రిలీజ్ చేయాలని ఈ క్యాంపెయిన్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.