గడ్డం వంశీ సత్తా ఉన్న లీడర్​ : శ్రీధర్​బాబు

గడ్డం వంశీ సత్తా ఉన్న లీడర్​ : శ్రీధర్​బాబు
  • ఆయన్ను గెలిపిస్తే యూత్​కు  జాబ్​లు 
  • కాళేశ్వరంతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ లక్ష కోట్లు దుర్వినియోగం చేసిండు
  • గ్యారంటీల అమలులో రాజీ ప్రసక్తే లేదని కామెంట్​
  • పదవి లేకుండానే ప్రజాసేవ చేశా.. ఎంపీగా గెలిపిస్తే మరింత డెవలప్​చేస్త: వంశీ
  • రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్​ పార్టీ మాత్రమేనని వెల్లడి
  • మిషన్​ భగీరథ పెద్ద ఫెయిల్యూర్: వివేక్​ వెంకటస్వామి
  • భూపాలపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవపూర్, కాటారం, వెలుగు:పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సత్తా ఉన్న యువ నాయకుడని, ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తాత కాకా వెంకటస్వామి వారసుడిగా ప్రజాసేవ చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తగా కూడా ఎదిగారని చెప్పారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, కాటారం మండలాల్లో వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామితో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

మహాముత్తారం, మహదేవపూర్​లలో నిర్వహించిన సభల్లో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పేరుతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు దుర్వినియోగం చేసిందని, ఆ నిధులే ఉండి ఉంటే రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించే అవకాశం ఉండేదన్నారు. 

జూన్ 6 తర్వాత మంథని నియోజకవర్గంలో పేదలకు 3,500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. యామనపల్లి నుంచి మహాముత్తారం వరకు రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్​ లైటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకంతో వంశీకృష్ణ గెలుపు బాధ్యతను అప్పగించిందని, ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలంటే ఆయన్ను గెలిపించాలన్నారు.

శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివి 

మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివని వంశీకృష్ణ అన్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంతా బాగుపడుతుందనుకుంటే డిగ్రీలు, పీజీలు చేసినవాళ్లు కూడా ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. 

రైతులకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. మీ చిన్న కొడుకులా భావించి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఏ పదవి లేకుండానే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని, ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొర్లకుంట నుంచి యామన్‌‌‌‌‌‌‌‌పల్లి వరకు,  బొమ్మాపూర్ క్రాస్ నుంచి మహదేవపూర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ, రోడ్ షోలు నిర్వహించారు. 

అంతకు ముందు, మంత్రి సొంతూరు అయిన కాటారం మండలం ధన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం లో శ్రీధర్​బాబు సోదరుడు శ్రీను బాబుతో కలిసి వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాదేవపూర్ ఎంపీపీ రాణీబాయి రామారావు, జడ్పీటీసీ గుడాల అరుణ, బ్లాక్ కాంగ్రె స్ అధ్యక్షుడు కోట రాజబాబు, పెద్ద సంఖ్యలో కాంగ్రె స్ లీడర్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

గత బీఆర్ఎస్​ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పెద్ద ఫెయిల్యూర్​అని వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని చెప్పినా.. ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కమీషన్ల కోసం, ఆంధ్రా కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండని విమర్శించారు. 

వీ6, వెలుగు మీడియా ద్వారా ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు వేలమందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని, మళ్లీ ఇప్పుడు కూడా నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తారన్నారు. ప్రజలకు సేవచేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వంశీ కృష్ణ ను ఆశీర్వదించాలని కోరారు.