వెడ్డింగ్​ సర్వీసులకు ఫుల్లు గిరాకీ..

వెడ్డింగ్​ సర్వీసులకు ఫుల్లు గిరాకీ..

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు పెద్దగా హడావుడిగా లేకుండానే చాలా మంది పెళ్లి చేసుకున్నారు. ఈ మహమ్మారి పీడ దాదాపు తొలగిపోవడంతో మునుపటి జోష్​ మళ్లీ వచ్చింది. ఈ ఏడాది వెడ్డింగ్​ సర్వీసులకు గిరాకీ ఎక్కువయింది. ఫంక్షన్​హాల్స్ కోసం ఎంక్వైరీలు 68 శాతం, వంటవాళ్ల కోసం ఎంక్వైరీలు 57 శాతం పెరిగాయి. నగల కొనుగోళ్ల కోసం ఆన్​లైన్​ లో సెర్చ్​లు 44 శాతం అధికమయ్యాయి. రిలయన్స్​ రిటైల్​కు చెందిన ‘జస్ట్​డయల్’​ స్టడీ రిపోర్టు ద్వారా ఈ వివరాలు తెలిశాయి.  భారతదేశంలోని 1,000 పట్టణాలు, నగరాల్లో ఫంక్షన్​ హాళ్లు, క్యాటరర్లు, డెకరేటర్లు, డీజేలు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వెడ్డింగ్ జువెలర్లు, టైలర్లు, మెహందీ ఆర్టిస్టులు, పురోహితులు, ఫోటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌లు, మ్యాట్రిమోనియల్ బ్యూరోలు, వెడ్డింగ్ బ్యాండ్‌‌‌‌లు వంటి వివాహ సేవలకు జస్ట్‌‌‌‌డయల్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో ఎంక్వైరీలు 30 శాతం పెరిగాయి.

టైర్​–2 సిటీల్లో డిమాండ్​ 48 శాతం, టైర్​–1 సిటీల్లో డిమాండ్​ 22 శాతం  పెరిగిందని జస్ట్​ డయల్​ చీఫ్​ మార్కెటింగ్ ఆఫీసర్​ ప్రసూన్​ కుమార్​ చెప్పారు. రాబోయే నెల రోజుల్లో దేశంలో 32 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని, కరోనా కారణంగా పరిమితులు విధించడంతో గత రెండేళ్లుగా వెడ్డింగ్​ సర్వీసుల ఆపరేటర్లు ఇబ్బందులు పడ్డారని వివరించారు. మనదేశంలో అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు పెళ్లిళ్లు చాలా కీలకమని, టైర్​–2 సిటీల్లో వీటి సంఖ్య పెరుగుతుండటం మంచి విషయమని కుమార్​ అన్నారు. టైర్​–1 సిటీల కంటే ఈ సిటీల్లో వెడ్డింగ్​ సర్వీసులకు డిమాండ్​ రెండు రెట్లు ఎక్కువగా ఉందని వివరించారు. 

ఈ ఐదు సేవలకు ఫుల్లు గిరాకీ..

ఆభరణాలు, బాంకెట్ హాల్స్, డెకరేటర్‌‌లు, ఫొటోగ్రాఫర్‌‌లు,  క్యాటరర్లకు అత్యధిక డిమాండ్‌‌ కనిపిస్తోంది. ఈ ఐదింటికి సంబంధించిన సేవల కోసమే 60 శాతం ఎంక్వైరీలు జరిగాయి.  పెళ్లిళ్ల నగల కోసం ముంబై నుంచి అత్యధిక డిమాండ్‌‌ కనిపించగా, తర్వాత ఢిల్లీ,  హైదరాబాద్ ఉన్నాయి. టైర్–-1 నగరాల్లో వీటికోసం సెర్చ్​లు 29శాతం పెరిగాయి. టైర్-–2 నగరాల్లో 44శాతం పెరిగాయి. టైర్-–2 నగరాల్లో జైపూర్ నుంచి డిమాండ్  ఎక్కువగా ఉండగా, తర్వాత సూరత్, రాజ్‌‌కోట్, చండీగఢ్  కోయంబత్తూర్ ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన మిగతా సర్వీసుల కంటే  ఫంక్షన్​ హాల్స్ ​కోసం  సెర్చ్‌‌లు 68 శాతం పెరిగాయి. టైర్–2 నగరాల్లో ఈ డిమాండ్ 83 శాతం పెరిగింది.  టైర్–1 నగరాల్లో 46 శాతం పెరిగింది.

ఫంక్షన్​ హాళ్ల సెర్చ్​లలో ముంబై మొదటిస్థానంలో ఉంది.  టైర్–1 నగరాల నుంచి డిమాండ్‌‌లో దాదాపు 27శాతం ఈ సిటీ నుంచే ఉంది.  ఢిల్లీ,  చెన్నై వరుసగా రెండవ,  మూడవ స్థానాల్లో ఉన్నాయి. తరువాతిస్థానాల్లో కోయంబత్తూర్, సూరత్, నాగ్‌‌పూర్, లక్నో  పాట్నా ఉన్నాయి. టైర్​–1 సిటీలైన ముంబై, ఢిల్లీ,  బెంగళూరులో  డెకరేటర్‌‌ల కోసం సెర్చ్​లు 31శాతం పెరిగాయి. చండీగఢ్, ఇండోర్, జైపూర్, లక్నో,  సూరత్ వంటి నగరాల్లో డిమాండ్ 43శాతం పెరిగింది.  ఫొటోగ్రాఫర్‌‌లకు డిమాండ్ 23శాతం పెరిగింది.ఈ విషయంలో  టైర్-–2 నగరాల్లో సెర్చ్​లు టైర్-–1 నగరాల కంటే 2.3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. టైర్-–1 నగరాల డిమాండ్‌‌లో దాదాపు 50శాతం వాటా ముంబై,  ఢిల్లీల నుంచే ఉంది.