- గత నెలలో నలుగురు.. చందాపూర్ ఎస్బీ ఘటనలో ఆరుగురు మృతి
- ఆందోళనలో కార్మిక కుటుంబాలు
సంగారెడ్డి, వెలుగు : జిల్లాలోని కెమికల్ఫ్యాక్టరీల్లో ఇటీవల జరుగుతున్న ప్రమాదాల కారణంగా కార్మికులు పని చేయాలంటే భయపడుతున్నారు. ఫ్యాక్టరీల యాజమాన్యాల తప్పిదాల కారణంగా, పనిచేసే చోట సరైన రక్షణ కల్పించకపోవడంతో బాయిలర్లు, రియాక్టర్లు పేలి కార్మికులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉండడంతో జీవనోపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడకు వచ్చి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పటాన్ చెరు, పాశమైలారం, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర
జహీరాబాద్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి పొంది స్థిరపడిన కార్మిక కుటుంబాలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో ఒక్క హత్నూర మండలంలో జరిగిన ప్రమాదాల కారణంగా మొత్తం 11 మంది కార్మికులు మృతి చెందారు. దాదాపు 30 మంది కార్మికులు గాయపడ్డారు.
ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో..
హత్నూర మండలం చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రియాక్టర్ పేలి ఆ ఫ్యాక్టరీ ఎండీ రవిశర్మతో సహా ఆరుగురు మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. రియాక్టర్ పేలిన ప్రాంతంలో ఎక్కువగా ఐరన్ వస్తువులు ఉండడం వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగింది. ప్రమాదం జరగడానికి ఐదు నిమిషాల ముందు ఎండీ, కొందరు ఉద్యోగులు బాయిలర్ వద్ద ఆయిల్ లీకేజీని పరిశీలిస్తుండగా రియాక్టర్ పేలింది. క్షణాల్లో విధ్వంసం జరిగి ఆరుగురు చనిపోగా పరిశ్రమలోని బిల్డింగులు ధ్వంసం అయ్యాయి.
మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నివేదిక కోరడంతో జిల్లా యంత్రాంగం స్పందించి ప్రమాదం జరగడానికి గల కారణాల గురించి తెలుసుకుంటోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేల్చింది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తారు.
కోవాలెంట్ లో నలుగురు మృతి
హత్నూర మండలం గుండ్ల మాచ్ నూర్ కోవాలెంట్ ఫ్యాక్టరీలో గత నెలలో రియాక్టర్ పేలి నలుగురు చనిపోయారు. రియాక్టర్ కు పక్కనే ఉన్న ఇనుప చువ్వలు తగిలి స్పార్క్ రావడంతో పక్కనే ఉన్న డ్రగ్స్ నిల్వలకు మంటలు వ్యాపించి రియాక్టర్ పేలింది. ఆ టైంలో అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన టైంలో ఒకరు మాత్రమే చనిపోగా, గాయపడిన ముగ్గురు కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఐదు రోజుల వ్యవధిలో చనిపోయారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదకర రసాయనాలు విడుదలై ఒక డ్రగ్గిస్ట్ మృతి చెందాడు.
ఈ రెండు ఘటనలు మరువక ముందే తాజాగా చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో ఆరుగురు చనిపోవడం, 25 మంది గాయపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కెమికల్ ఫ్యాక్టరీల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.