రైతుల్ని నిండాముంచిన చెడగొట్టు వానలు

రైతుల్ని నిండాముంచిన  చెడగొట్టు వానలు
  • మక్క, మామిడి, వరి, మిర్చికి తీవ్ర నష్టం  
  • కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు
  • ఐదుకు చేరిన పిడుగుపాటు మృతుల సంఖ్య

వెలుగు, నెట్​వర్క్: రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉదయం చేన్ల వద్దకు వెళ్లిన రైతులు.. నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి, మక్క, బొప్పాయి, మిర్చిని చూసి కంటతడిపెట్టారు. భారీ నష్టం జరగడంతో చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్​ జిల్లాలో అత్యధికంగా ఇల్లందకుంట మండలంలో1,215 ఎకరాల్లో, వీణవంక మండలంలో 600 ఎకరాల్లో మక్కజొన్న నేలకొరిగింది. జమ్మికుంట మండల కేంద్రంతోపాటు కాపులపల్లి, కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో మక్క, మిరప, కోతకు వచ్చిన వరి పొలాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఒక్క కాపులపల్లి గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో మక్క, 50 ఎకరాల్లో వరి, మరో 50 ఎకరాల్లో మిరప పంట దెబ్బతింది. గన్నేరువరం మండల కేంద్రంలో కాంతాల కిషన్ రెడ్డి, కొండల్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లపై భారీ వృక్షం కూలడంతో ధ్వంసమయ్యాయి. 


ఈ మండలంలో 60 ఎకరాల్లో మక్క దెబ్బతిన్నట్లు ఏవో కిరణ్మయి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వర్ని, బీర్కూర్, నస్రుల్లాబాద్, నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, ఇందల్వాయి, రేంజల్ తదితర మండలాల్లో మక్క, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆర్మూర్ డివిజన్​లోని పలు మండలాల్లో రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసికొట్టుకుపోయాయి. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు టీములుగా ఏర్పడి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గుండాల, టేకులపల్లి మండలాల్లో దాదాపు 200కి పైగా ఎకరాల్లో మక్కజొన్న నేలవాలింది. చండ్రుగొండ మండలంలో మిర్చి పంట కల్లాల్లో తడిసింది. బూర్గంపహాడ్ మండలంలో దాదాపు 10 ఎకరాలకు పైగా బొప్పాయి పంటకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో 1500 ఎకరాల్లో మక్క పంట నేలమట్టమైందని వ్యవసాయాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వెయ్యి ఎకరాల్లో ఉల్లి, 500 ఎకరాల్లో కూరగాయలు, 250 ఎకరాల్లో మామిడి, 450 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో చెరుకు, 250 ఎకరాల్లో మక్క, మరో 250 ఎకరాల్లో బొప్పాయి, శనగ పంటలు దెబ్బతిన్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురు గాలులకు  మామిడి నేలరాలింది. పలుచోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పెద్దకొత్తపల్లి మండల కేంద్రం సమీపంలో  రైతు నాగరాజుకు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో300 మామిడి చెట్లు నేలకొరిగాయి. దీంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో గురువారం కురిసిన వర్షానికి 22 ఎకరాల్లో ఆముదం, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.


పిడుగుపాటుతో ఒకరు మృతి

వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం చిక్కేపల్లి గ్రామంలో గురువారం రాత్రి  పిడుగుపాటుకు ముంత సహదేవుడు (33) మృతి చెందాడు. పొలం వద్ద కరెంట్​మోటార్ ఆఫ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. మృతుడికి భార్య తిరుపతమ్మ, ఒక కూతురు,  కుమారుడు ఉన్నారు. పిడుగుపాట్లకు గురువారం సాయంత్రం వరకు నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహాముత్తారం, కిష్టాపూర్, మీనాజీపేట, ములుగుపల్లి గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చిపంట వరదకు కొట్టుకుపోయింది. చేలలో పంట నేలవాలింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.