సిరిసిల్ల సెస్ లో పేరుకుపోయిన బకాయిలు

సిరిసిల్ల సెస్ లో పేరుకుపోయిన బకాయిలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అధికారులు ఎన్నిసార్లు నోటీస్ లు పంపినా బకాయిలు మాత్రం వసూలవడం లేదు. నవంబర్​1వ తేదీన సెస్ కు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బకాయిలు ఉన్న వినియోగదారుల ఓటు కట్ చేశారు. దీంతో దాదాపు 38వేల మంది ఓటుహక్కు కోల్పోయారు. అయితే బకాయి ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి మాత్రం డబ్బులు వసూలు కావడం లేదు. ఆగస్టు 16వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2.91లక్షల విద్యుత్ ​కనెక్షన్లలో బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

రూ.302 కోట్ల బకాయిలు..

సెస్​లో ప్రభుత్వ కార్యాలయాల  బకాయిలు రూ.302.64కోట్లు ఉన్నాయి. పైగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కూడా సెస్​కు చెల్లించలేదు. గ్రామ పంచాయతీల వాటర్ వర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ బకాయిలు రూ.164.94 కోట్లు, సిరిసిల్ల మున్సిపాలిటీ రూ.88లక్షలు, వేములవాడ మున్సిపాలిటీ రూ.91 లక్షలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.3.07 కోట్లు, ప్రభుత్వం అందించే పవర్​లూం సబ్సిడీకి సంబంధించి రూ.42.01 కోట్లు, ఎస్సీ, ఎస్టీ 101 యూనిట్ల సబ్సిడీకి సంబంధించి రూ.3.22 కోట్ల బకాయిలు ఉన్నాయి. గత ఆగస్టు నెల వరకు ఈ బకాయిలు చెల్లించాలని అన్ని కార్యాలయాలకు సెస్ నోటీసులు జారీ చేసినా అధికారులు స్పందించలేదు. కాగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు కలిపి మరో రూ.3కోట్ల బకాయిలు ఉన్నాయని, సెస్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది కరెంట్ బిల్లుల రీడింగ్ తీయలేదని అధికారులు చెబుతున్నారు. 

బిల్లు కట్టని ఆఫీస్​లపై చర్యలేవీ?

సెస్ ఎన్నికల నేపథ్యంలో ఓటు తీసేస్తారనే భయంతో కొందరు బకాయిలు కట్టారు. మరోవైపు రూ.కోట్లలో ఉన్న బకాయిలు ఎలా వసూలు చేయాలో తెలియక సెస్​అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2019 నుంచి సెస్ కు పాలకవర్గం లేపోవడంతో గవర్నమెంట్ ఆఫీసుల బకాయిలు వసూలు కాలేదు. తమకు బకాయిలుంటే ఓటు తీసేశారు.. కానీ ప్రభుత్వ ఆఫీసులలో బిల్లులు వసూలు కాకపోతే చర్యలెందుకు తీసుకోరని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వ బకాయిలు రూ.45 కోట్లు..

సెస్ కు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు సుమారు రూ.45 కోట్లు ఉన్నాయి. విద్యుత్ బిల్లులకు సంబంధించి పవర్​లూం సబ్సిడీ రూ.42 కోట్లు, ఎస్సీ, ఎస్టీ 101 యూనిట్లకు సంబంధించి రూ.3.22కోట్లను ప్రభుత్వం సెస్ కు చెల్లించాల్సి ఉన్నా రెండేండ్ల నుంచి డబ్బులు కట్టడం లేదు. 

నోటీసులు జారీ చేస్తున్నాం

బకాయిల కట్టాల్సిందిగా ప్రభుత్వ ఆఫీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఏటా బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు కొంత  బకాయిని పే చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్​లు వీలును బట్టి పే చేస్తున్నాయి. జీపీ స్ట్రీట్ లైట్స్ కు సంబంధించి బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. సెస్ ఎన్నికల అనంతరం పాలకవర్గం ఏర్పడిన తర్వాత తీసుకునే నిర్ణయాలను బట్టి బకాయిల వసూళ్లపై దృష్టి పెడతాం. - ఈశ్వర్, డీఈ