Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లోని ‘దర్బార్ హాల్’, ‘అశోక్ హాల్’ పేర్లు మార్పు..

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లోని ‘దర్బార్ హాల్’, ‘అశోక్ హాల్’ పేర్లు మార్పు..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న కొన్ని హాల్స్కు గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. ‘దర్బార్ హాల్’ పేరును ‘గణతంత్ర మండప్’ అని, ‘అశోక్ హాల్’ను ‘అశోక్ మండప్’ అని పేరు మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లోనే జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. భారత్లో రాజుల కాలంలో, బ్రిటీష్ పాలనలో ఈ ‘దర్బార్’ అనే పదం వాడుకలో ఉండేది. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించాక ‘దర్బార్’ అనే పదం దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. ‘గణతంత్ర’ అనే పదం స్వతంత్ర భారతంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందువల్లే.. ‘దర్బార్ హాల్’ పేరును ‘గణతంత్ర మండప్’ అని మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక.. ‘అశోక్ హాల్’ అనే పేరును ‘అశోక్ మండప్’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. 

ALSO READ | స్పీకర్​ వర్సెస్​ అభిషేక్​ బెనర్జీ .. లోక్​సభలో బడ్జెట్​పై చర్చ 

‘అశోక్’ అనే పదానికి ‘బాధల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందడం’ అనే అర్థం వస్తుందని.. పైగా ‘అశోక’ అనే పేరు గొప్ప రాజు అయిన ‘అశోక చక్రవర్తి’ పేరును ప్రతిబింబిస్తుందని కేంద్రం తెలిపింది. జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేసింది. ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండప్’ అని మార్చడం భాషలో ఏకత్వాన్ని సాధించడంతో పాటు ‘హాల్’ అనే ఆంగ్ల పదాన్ని తొలగించినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది. రాష్ట్రపతి భవన్ లో హాల్స్ కు పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. ‘దర్బార్ అనే కాన్సెప్ట్ లేదు సరే.. కానీ షెహన్షా కాన్సెప్ట్ ఉంది.. ఇంట్రస్టింగ్’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కామెంట్ చేశారు.