వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం దుర్గంచెర్వు గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించరాదని గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమవారం జీపీ కార్యాలయంలో సర్పంచ్ లచ్చవోళ్ల లావణ్య, ఉప సర్పంచ్ సలియా బీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తీర్మానం ప్రకారం బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే రూ.25 వేల జరిమానా విధించనున్నారు. మద్యం సేవించి కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో గొడవలకు పాల్పడితే రూ.5 వేల జరిమానా విధించనున్నారు. అలాగే మద్యం విక్రయంపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
గ్రామంలోని రహదారుల పక్కన, స్కూళ్లు, పవిత్ర స్థలాల పరిసరాల్లో మద్యం సేవించినా రూ.5 వేల జరిమానా విధిస్తామని పంచాయతీ స్పష్టం చేసింది.
