పెరిగిన సాగు విస్తీర్ణం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు

పెరిగిన సాగు విస్తీర్ణం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు
  • ఇటీవల వర్షాలతో జోరుగా వ్యవసాయ పనులు 
  •  మరో 15 రోజులు దాకా వరి నాట్లకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

పెద్దపల్లి, వెలుగు:  వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 12.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు అధికారులు చెప్తున్నారు. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో వర్షాలు సరిగా పడకపోవడంతో పంటలు వేయడం లేటయింది. ఇటీవల వరుసగా ముసురు వానలు, భారీ వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మరో 15 రోజుల వరకు నాట్లు వేసే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రధాన పంటలతోపాటు మిల్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగుపై ఆసక్తి 

ఈ ఏడాది రైతులు వరి, మొక్కజొన్న, పత్తితో పాటు మిల్లెట్స్​సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగు ఐదారు వేల ఎకరాల్లోపే ఉండగా.. ఈ సారి 10వేల ఎకరాలకు పైగా సాగుచేసినట్లు హార్టికల్చరల్ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12.01 ఎకరాల్లో వివిధ పంటలు వేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 

వీటిలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగవుతుండగా అందులో వరి 1.98 లక్షల ఎకరాలు, పత్తి 48 వేలు ఎకరాల్లో, కరీంనగర్​ జిల్లాలో 3.12 లక్షల ఎకరాలకు గానూ వరి  2.52 లక్షలు, పత్తి 45 వేల ఎకరాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో  2.35 లక్షల ఎకరాలకు గానూ వరి1.84 లక్షలు, పత్తి 46 వేల ఎకరాలు, జగిత్యాలలో 3.94 లక్షల ఎకరాలకు గానూ వరి 3.12 లక్షలు, పత్తి 16 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

నాట్లు వేసేందుకు మరో 2వారాలు అనుకూలం

వ్యవసాయ శాఖ నిర్ణయించిన సాగు లక్ష్యం 100 శాతం పూర్తి చేసే దిశగా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం వరకు సాగు పూర్తి కాగా.. మరో రెండు వారాల దాకా వరి నాట్లు వేసేందుకు అనుకూలంగా ఉంటుందంటున్నారు. దీంతో సాగు లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉంది. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో సరిగా వానలు పడకపోవడంతో స్లో అయిన పనులు... ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. 

ఇటు భూగర్భ జలాలు పెరగడంతోపాటు, కాలువల ద్వారా నీరు వస్తుండడంతో సాగుపై రైతులు ఆశాజనకంగా ఉన్నారు. కాగా ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్​ ఇస్తుండటంతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్నాలే సాగు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.