Good Health : తెలంగాణకు దేవుడిచ్చిన పంట.. ఈ దుస్సవడ్లు

Good Health : తెలంగాణకు దేవుడిచ్చిన పంట.. ఈ దుస్సవడ్లు

దుక్కిదున్నాలి. నీరు పట్టాలి . ఆ తర్వాత నాటు. అంతటితో అయిపోయింది అనుకోవడానికి లేదు. టైంకి కలుపు తీయాలి. చీడపీడలు పట్టకుండా మందులు కొట్టాలి. నేల తడి ఆరకుండా రేయింబవళ్లు కాపలా కాయాలి. ఇంత కష్టపడితే నాలుగైదు నెలలకి వడ్లు చేతికొస్తాయి. కానీ, దుస్సవడ్ల సాగుకి విత్తనాలతో పనిలేదు. ప్రతిరోజూ నీళ్లు పట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే సాగు చేయకుండానే చేతికొచ్చే పంట ఇది. అందుకే గిరిజనులు దీన్ని 'దేవుడిచ్చిన పంట' అని చెబుతుంటారు.

దుస్సవడ్ల పంటకి ఎకరాల కొద్దీ పొలం అవసరం లేదు. చెరువు, కుంటలు నిండుగా నీళ్లుంటే చాలు. వర్షాకాలం తొలకరి జల్లులకి వాటంతట అవే చెరువులు, కుంటల్లో మొలకెత్తి అక్టోబర్ నాటికి చేతికొస్తాయి. అందుకే దుస్సవడ్లని అందరూ ప్రకృతి వరంగా చెబుతారు. గిరిజనులు వీటిని వండుకుని తింటారు కూడా.

ఎలాంటి కెమికల్స్ వాడకుండా నేచురల్ గా పండే పంట కావడం వల్ల పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిలో. అందుకే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం అటవీ గ్రామాల్లోని గిరిజనుల దగ్గర చాలామంది ఈ వడ్లని కొంటుంటారు.

Also Read :- దసరా నవరాత్రుల్లో మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా

అచ్చం వడ్లే..!

దుస్సవడ్ల పంట అచ్చం మామూలు వడ్ల పంటలాగే ఉంటుంది. కాకపోతే ఈ వడ్ల గింజల చివరన పొడవాటి ముళ్లు ఉంటాయి. అందుకే దుస్స వడ్లను వరిని కోసినట్లుగా కాకుండా వెదురు కర్రలతో రాల్చుతారు. వీటిని రాల్చేందుకు ప్రత్యేకంగా వెదురుతో కర్రబుట్టలు తయారుచేస్తారు. వాటి సాయంతో మంచు కురిసే టైంలో రాల్చి వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వీటిని రోకళ్ళతో దంచి బియ్యంగా మారుస్తారు. ఈ బియ్యం ఎరుపు రంగులో ఎంతో టేస్టీగా ఉంటాయి. చాలా మంది ఈ బియ్యాన్ని ఉగ్గులా వండి చిన్నపిల్లలకి తినిపిస్తారు. దీపావళి నోముల్లో నైవేద్యం మహాముత్తారం మండలంలోని యామన్ పల్లి, మాదారం, నిమ్మగూడెం, కేశవాపూర్, రెడ్డిపల్లి, కనుకునూర్, బోర్లగూడెం, మీనాజీపేట, నర్సింగాపూర్ .. తదితర గిరిజన గ్రామాల్లో దీపావళి నోములకు దుస్సవడ్ల బియ్యాన్నే నైవేద్యంగా పెడతారు. సిటీ జనాలు కూడా నైవేద్యం కోసం వీళ్ల దగ్గరే ఈ వడ్లు కొంటారు. దాంతో ఈ సీజన్ అంతా తమకు ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు గిరిజనులు. 

రెండు బస్తాలు దులుపుతా...

దుస్సవడ్ల పంట ఈ ఏడాది చెరువులు, కుంటల్లో బాగా పెరిగింది. వానలు మంచిగా పడటంతో పంట బాగా వస్తోంది. ఈ సీజన్ లో రెండు బస్తాల దుస్స వడ్లు రాల్చా. వీటిని రోకళ్ళలో దంచుకుని బియ్యం చేసి అన్నం వండుకుని తింటాం. దీపావళి నోములకు నైవేద్యం పెట్టడానికి చాలామంది. నా దగ్గరకి వచ్చి వీటిని కొంటున్నారు కూడా. కిలో వడ్లకి రూ. 200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నారు. దుస్స బియ్యం అన్నాన్ని చిన్న పిల్లలకు పెడితే రోగాలు కూడా రావు.
- గోగు రాజసమ్మయ్య, యామన్ పల్లి