ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు 

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం (అక్టోబర్ 15) నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి, 
అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి, అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి, అక్టోబరు 20న(మూలానక్షత్రం రోజున) సరస్వతీ దేవి, అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, అక్టోబరు 22న శ్రీ దుర్గాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.

దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేశారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఘాట్లలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.