యూట్యూబర్ : డచ్‌ నుంచి వచ్చి ..చోర్‌‌ బజార్‌‌కు

యూట్యూబర్ : డచ్‌ నుంచి వచ్చి ..చోర్‌‌ బజార్‌‌కు

చాలామందికి ట్రావెలింగ్‌ చేయడమంటే ఇష్టం. కానీ..అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే కొందరు ట్రావెలింగ్‌ చేస్తూ... వాళ్ల అనుభవాలను వీడియో తీస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ట్రావెలింగ్‌ కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి ట్రావెలింగ్‌ యూట్యూబర్లు చాలామంది ఇండియా నుంచి ఫారిన్‌ వెళ్తున్నారు. అయితే.. అలా ఇండియాకు కూడా చాలామంది వస్తున్నారు. ఈ మధ్య డచ్‌కు చెందిన యూట్యూబర్‌ పెద్రో ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచే తన ట్రావెలింగ్‌ జర్నీని మొదలుపెట్టాడు. 

డచ్‌‌కి చెందిన పెద్రోకు చిన్నప్పటినుంచి ట్రావెలింగ్‌‌ అంటే ఇష్టం. అందులోనూ బైక్‌‌ మీద రైడ్‌‌ చేస్తూ.. దేశాలను చుట్టేయడమంటే ఇంకా ఇష్టం. అందుకే 2014లో ‘‘పెద్రో మోట” పేరుతో ఒక యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టి ప్రపంచాన్ని చుట్టేయాలనే ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే ముందు ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ తర్వాత కూడా కొన్ని దేశాలు తిరిగాడు. కానీ.. పెద్దగా సక్సెస్‌‌ రాలేదు. ఇప్పటివరకు ఆ ఛానెల్‌‌లో 271 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. కానీ.. అతనికి కేవలం 85 వేల మంది సబ్‌‌స్క్రయిబర్స్‌‌ మాత్రమే వచ్చారు. ఛానెల్‌‌ నుంచి డబ్బు కూడా అంతగా రాలేదు. 

మోటో వ్లాగ్స్‌‌

ఛానెల్‌‌లో ఎక్కువగా మోటో వ్లాగ్స్‌‌ చేస్తుంటాడు. పెద్రో ఎక్కడికి వెళ్లినా.. అక్కడి అందమైన ప్రదేశాల ఫోటోలు, వీడియోలను సబ్‌‌స్క్రయిబర్లతో పంచుకుంటాడు. బైక్ రైడ్స్‌‌కు సంబంధించిన  సలహాలు కూడా చెప్తుంటాడు. అయితే.. యూట్యూబ్‌‌ నుంచి పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఉన్న డబ్బంతా ట్రావెలింగ్‌‌ కోసం ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. “నా దగ్గర డబ్బు లేదు” అనే టైటిల్‌‌తో ఒక వీడియో కూడా అప్‌‌లోడ్‌‌ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇబ్బంది పడి మళ్లీ నిలదొక్కుకున్నాడు. 

మోటో ట్రావెలింగ్‌‌లో గంటల కొద్దీ ఫుటేజ్ తీయడం, డబ్బులు ఖర్చు చేయడం, వీడియోలు ఎడిట్ చేయడం.. ఇలా ప్రతి విషయం కష్టమే. అందుకే ఇప్పుడు రూట్‌‌ మార్చాడు. మోటో వ్లాగ్స్‌‌ని తగ్గించి, ట్రావెలింగ్‌‌ మీదే దృష్టి పెట్టాడు. అందులో భాగంగా తొలి అడుగు ఇండియాలో వేశాడు. అప్పటికే మోటో వ్లాగ్స్‌‌ కోసం చాలా దేశాలు తిరిగిన అనుభవం పెద్రోకు ఉంది. ఆ అనుభవంతో ఇండియాలో తిరుగుతూ వీడియోలు చేస్తున్నాడు. 

కొత్త ఛానెల్‌‌

పెద్రో ట్రావెలింగ్‌‌ వీడియోలను అప్‌‌లోడ్‌‌ చేయడానికి ‘‘మ్యాడ్లీ రోవర్‌‌‌‌’’ మరో ఛానెల్‌‌ని మొదలుపెట్టాడు. మొదటి ఛానెల్‌‌లో బైక్ రైడింగ్‌‌ వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తూనే.. ఇందులో ట్రావెలింగ్‌‌ వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నాడు. అయితే.. మొదటి ఛానెల్‌‌ కోసం ఏడెనిమిది ఏండ్లు కష్టపడినా.. దానికి 85 వేల మంది సబ్‌‌స్క్రయిబర్స్‌‌ మాత్రమే వచ్చారు. కానీ.. సెకండ్‌‌ ఛానెల్‌‌ మ్యాడ్లీ రోవర్‌‌‌‌ ఈ ఏడు జనవరిలో మొదలుపెట్టినా ఇప్పటివరకు లక్షా 35 వేల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ఈ ఛానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసిన మొదటి వీడియో ఇండియాలో తీసిందే. అలాగే ఈ ఛానెల్‌‌లో పెట్టిన కొన్ని వీడియోలు వైరల్‌‌ అయ్యాయి కూడా. 

ఇండియాలో దాడి

పెద్రో ఇండియాలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ ఈ ఏడాది మార్చిలో బెంగళూరు వెళ్లాడు. సిటీలోని సుల్తాన్‌‌పేటలోని చోర్ బజార్‌‌లో వీడియోలు తీశాడు. అలా వీడియోలు తీస్తున్నప్పుడు ఒక వ్యాపారి అతనిపై దాడి చేశాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌‌గా మారింది. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. మార్కెట్‌‌లో బట్టలు అమ్మే దుకాణాల దగ్గర వ్యాపారులను పెద్రో రికార్డు చేస్తున్నాడు. దాంతో పాటు.. అక్కడ కలియతిరుగుతూ.. అక్కడివాళ్లను విష్‌‌ చేస్తూ ఇంటరాక్ట్‌‌ అవుతున్నాడు. 

అదే టైంలో ఒక వ్యాపారి తనను వీడియో తీయడానికి అడ్డు చెప్పాడు. వెంటనే ఫుటేజీని డిలీట్‌‌ చేయాలని పెద్రోతో వాదించాడు. కానీ.. పెద్రో మాత్రం తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, హాని కలిగించలేదని చెప్తున్నా వినకుండా చేతిని గట్టిగా పట్టుకోవడంతోపాటు పెద్రోని బూతులు తిట్టాడు. తర్వాత చేయిని మెలితిప్పి, లంగ్స్‌‌ మీద కొట్టాడు. ఎలాగోలా పెద్రో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 

కేసు నమోదు

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ముఖ్యంగా బెంగళూరు వాసులు దాడిని విమర్శించారు. పెద్రోకు క్షమాపణలు చెప్పారు. కొందరు ఈ వీడియోను సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దాంతో డీసీపీ లక్ష్మణ్ నింబార్గి దాడి చేసిన వ్యక్తిపై సుమోటోగా కేసు నమోదు చేసి, కాటన్‌‌పేట పోలీస్ స్టేషన్‌‌ పరిధిలో అతని కోసం గాలించారు. అతను దొరికిన తర్వాత కర్నాటక పోలీసు చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం అతన్ని అరెస్టు చేశారు. అతను కూడా చోర్ బజార్‌‌లో బట్టలు అమ్ముతుంటాడు.