గత ప్రభుత్వం గాలికి వదిలేసిన దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే... బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్టలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. రూ.60.62 కోట్ల విలువైన 7 విద్యుత్ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష బిఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వాలపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టామని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు... లోపల మాత్రం ఖజానాను ఖాళీ చేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి, పేదలకు చెందాల్సిన సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. తాము అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపడం లేదని స్పష్టం చేశారు.
నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ ఇప్పటికే 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చింది కానీ, డిస్కమ్‌లకు పైసా డబ్బులు చెల్లించలేదని... తాము అధికారంలోకి వచ్చాక డిస్కమ్‌లకు బకాయిలు చెల్లిస్తూ విద్యుత్ రంగాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు.
ALSO READ : సన్నీలియోన్ కు CID నోటీసులు
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తుల దయాదక్షిణ్యాల కోసం రైతులు ఎదురుచూసేలా కేంద్రం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వడ్ల కొనుగోళ్లు జరగడం లేదని.. కానీ తెలంగాణలో తాము వడ్లతో పాటు మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు.
స్థానిక అవసరాల దృష్ట్యా రఘునాథపల్లిలో 230 కేవీ (KV) సబ్ స్టేషన్ ఏర్పాటును పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఇళ్లపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల తొలగింపునకు కొన్ని నియోజకవర్గాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.ఎన్నికల సమయంలో తాను, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
