
న్యూఢిల్లీ: యూకే కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఐటీ సేవల సంస్థ ఈఅప్ సిస్, హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను (జీసీసీ) విస్తరించింది. రాబోయే రెండు సంవత్సరాల్లో హైదరాబాద్‌లోని తమ ఉద్యోగుల సంఖ్యను 200 నుంచి 500కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దీని సీటింగ్ కెపాసిటీ 400. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సర్వీస్ ఆధారిత కంపెనీలను నడపడం తేలికే కానీ ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలు ఎక్కువ సవాళ్లు ఎదుర్కొంటాయి. హైదరాబాద్ టెక్ హబ్‌గా గుర్తింపు పొందుతుండటం ప్రశంసనీయం. సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎగుమతుల్లో మన రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కంపెనీలు యూనికార్న్ స్థాయిని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలి”అని అన్నారు. ఏఐ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను అందించేందుకు ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో గతంలో మూడు మాత్రమే యూనికార్న్‌లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 40కి చేరిందన్నారు. ఈఅప్ సిస్కొత్త ఆఫీస్ సామర్థ్యం భవిష్యత్తులో 4–6 రెట్లు పెరగాలన్నారు. ఈ కేంద్రం నుంచి ఆసియా-–పసిఫిక్, యూరోప్, మిడిల్ఈస్ట్, ఉత్తర అమెరికాలోని తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని ఈఅప్ సిస్ తెలిపింది.