
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు గత నెల రెట్టింపుకు పైగా పెరిగాయి. ఈ విభాగంలో టాటా మోటార్స్ 6,216 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో మొదటిస్థానంలో ఉందని డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది.
సెప్టెంబరులో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 15,329 యూనిట్లకు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో కేవలం 6,191 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టాటా మోటార్స్ 62 శాతం వృద్ధిని సాధించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,912 యూనిట్లను, మహీంద్రా అండ్ మహీంద్రా 3,243 యూనిట్లు అమ్మింది.
బీవైడీ ఇండియా 547 యూనిట్లు, కియా ఇండియా 506 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 349 యూనిట్లు, బీఎండబ్ల్యూ ఇండియా 310 యూనిట్లను అమ్మాయి. టెస్లా ఇండియా కూడా గత నెలలో 64 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ రిటైల్ అమ్మకాలు సెప్టెంబరులో 1,04,220 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెల సేల్స్ 90,549 యూనిట్లతో పోలిస్తే 15 శాతం ఎక్కువ.