ఇ-సిగరెట్‌‌ తాగినా డేంజరే

ఇ-సిగరెట్‌‌ తాగినా డేంజరే

పొగ తాగేటోళ్లు పెరిగిపోతున్నరు. తాగి తాగి కుటుంబాలు నాశనమైపోతున్నయ్‌‌. పొగ మానిపియ్యాలని కొంతమంది దేవుళ్లను మొక్కుకుంటే.. కొంతమంది డాక్టర్ల దగ్గరికి పోతున్నరు. కొంతమందేమో ప్రకటనల మాయలో పడి.. ‘ఇ –సిగరెట్‌‌ తాగితే ఆ సిగరెట్‌‌ మానేసినట్టే’ అని తెగ తాగుతున్నరు.

ప్రధానికి లేఖ రాసిన్రు

దేశ వ్యాప్తంగా వెయ్యిమంది స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌,  టీచర్లు.. పబ్లిక్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్స్‌‌తో కలిసి మొన్న ప్రధానికి ఒక లేఖ రాసిన్రు. దాంట్లో ఇ– సిగరెట్లను నిషేధించాలని ఆయన్ను వేడుకున్నరు. “మేం స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌మి.  కొత్తగా వచ్చిన  ఇ–సిగరెట్లను మా దోస్తులు విపరీతంగా తాగుతున్రు. అదేంది అంటే స్టైల్‌‌ అంటున్నరు.  వాటిని ‘ఫన్‌‌ డివైసెజ్‌‌లు’ అని అనుకుంటున్నరు. ఆరు, ఏడు తరగతి చదువుతున్నప్పుడే ఇ– సిగరెట్లు తాగుడు మొదలుపెట్టి.. వాటికి అడిక్ట్‌‌ అయితున్నరు.  అడిక్షన్‌‌  ప్రమాదకర స్థితికి చేరింది.   ‘ ఇ–సిగరెట్లు తాగితే మంచిది’ అనే తప్పుడు సమాచారం, ప్రచారం వల్ల ఇట్లా జరుగుతోంది. ఇది తెల్వకనే కొంతమంది తల్లిదండ్రులు, టీచర్లు  దీన్నొక సమస్య అనుకుంటలేరు. మాది చిన్న వయసు. నికోటిన్‌‌ బానిసలుగా మారుస్తున్న  ఎలక్ట్రానిక్‌‌ నికోటిన్‌‌ డెలివరీ సిస్టమ్‌‌(ఎండ్స్‌‌) నిషేధించాలని కోరుతున్నం’’ అని పిల్లలంతా సంతకం చేసి ప్రధానికి పోస్ట్‌‌ చేసిన్రు. ఇదే సమస్యపై.. పోయిన్నెల కొంతమంది డాక్టర్లు కూడా ప్రధానికి లేఖ రాసిన్రు. దీన్ని లైట్‌‌ తీసుకుంటే.. ఈ అడిక్షన్‌‌ పిల్లలను నాశనం చేస్తుందని రాసిన్రు.

 ఎక్కడ పుట్టింది?

ఇ-ఎలక్ట్రానిక్‌‌ సిగరెట్లను 2003లో చైనా కనిపెట్టింది. ‘ సిగరెట్‌‌ స్మోకింగ్‌‌ నుంచి బయటపడెయ్యడానికి ఇవి ఉపయోగపడ్తయ్‌‌’ అని ప్రకటించింది. దీంతో అవి నెమ్మదిగా 2006లో యూరప్‌‌, అమెరికా మార్కెట్‌‌లోకి చేరినయ్‌‌. ఇవి పెన్నుల్లాగే ఉంటయ్‌‌.  దీనికొక బ్యాటరీ ఉంటది. లోపల క్యాట్రిడ్జ్‌‌లో నికోటిన్‌‌ లిక్విడ్‌‌తో పాటు, ప్రొప్లీన్‌‌ గ్లైకోల్‌‌, గ్లిజరాల్‌‌ ఉంటయ్‌‌.  అది హీటింగ్ ఎలిమెంట్‌‌పైన ఉంటది. బ్యాటరీ సాయంతో నికోటిన్‌‌ లిక్విడ్‌‌ని మండించడం వల్ల ఆవిరి వస్తది. దాన్నే  తాగుతరు. అచ్చం దోమలను పారదోలేందుకు  లిక్విడ్‌‌ మందును కరెంట్‌‌తో మండించినట్టన్నమాట. ఆ ఆవిరిని తాగడం వల్ల సిగరెట్‌‌ తాగిన ఫీలింగ్‌‌ కలుగుతది. వీటిలో రీచార్జబుల్ బ్యాటరీలతో కొన్ని ఉంటే.. క్యాట్రిడ్జ్‌‌ని మార్చుకునే సదుపాయం కలిగినయ్ కూడా ఉంటయ్. వీటి ధర   రూ.3 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటది.  దాంట్లో లిక్విడ్‌‌ అయిపోగానే.. వెయ్యి రూపాయలు పెట్టి రీఫిల్‌‌ మార్చుకోవచ్చు. అలా రెండువందల సార్లు మార్చుకోవచ్చు.

ఈ సిగరెట్లు తాగితే..

ఇ-సిగరెట్లు తాగితే సేఫ్‌‌రా భయ్‌‌’ అని అనుకుంట తాగుతున్నరు. వీటిలో కూడా నికోటిన్‌‌ ఉంటది. కానీ, తక్కువ మోతాదులో. నికోటిన్‌‌ మెదడు ఎదుగుదలను అడ్డుకుంటది. పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటది. ఇది తాగినంక అసలు సిగరెట్లు తాగాలనే కోరిక పుడ్తది. దీర్ఘకాలికంగా వీటిని తాగడం వల్ల ఆర్థరైటిస్‌‌ వస్తది. ఇందులో నికోటిన్‌‌తో పాటు.. ఆకర్షణ కోసం వాడే కెమికల్స్‌‌ క్యాన్సర్‌‌‌‌కి దారి తీస్తయ్‌‌. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 251 అధ్యయనాలు జరిగితే.. అన్ని అధ్యయనాల్లో ‘ఎలక్ట్రానిక్‌‌ సిగరెట్లు తక్కువ హాని చేస్తయ్‌‌’ అనేది ఒక భ్రమేనని, దానికొక్క ఆధారం కూడా దొరకలేదని తేలింది.  మామూలు సిగరెట్‌‌ తాగినప్పుడు ఏడు వేల కెమికల్స్ విడుదలైతయ్. ఇందులో 70 క్యాన్సర్‌‌‌‌ కారకాలు. ఇ-– సిగరెట్లలోనూ క్యాన్సర్‌‌‌‌ కారకాలు ఎక్కువే.

 ఎక్కడ నిషేధించినరు?

మొదట్లో ఇది పొగ తాగుడు తగ్గించేది అనుకున్నరు. అందుకే చానామంది దీనివైపు మళ్లిన్రు. కానీ, తర్వాత అధ్యయనాల్లో ఇది డేంజర్‌‌‌‌ అని తేలింది. దీంతో ఇప్పటికే 36 దేశాలు ఇ–సిగరెట్లను నిషేధించినయ్‌‌.  గతేడాది కోర్టు మొట్టికాయలు వెయ్యడంతో..‘ ఎలక్ట్రానిక్ సిగరెట్లను తయారు చేసుడు, అమ్ముడు ఆపేయ్యలని’ రాష్ట్రాలకు సలహా ఇచ్చింది కేంద్రం. ‘‘ మన దేశంలో ఇ– సిగరేట్లు అమ్ముతున్న   ‘జేయూయూఎల్‌‌’ అనే అమెరికా కంపెనీని బ్యాన్‌‌ చెయ్యాలె. లేకుంటే కఠిన చర్యలుంటయ్‌‌’ అని  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రతిసూధన్‌‌ ఆర్థికశాఖకు లేఖ రాసిండు. ఇంకా చర్యలు మాత్రం తీస్కొలే.   ఇప్పటికే దేశంలో పంజాబ్‌‌, కర్ణాటక, కేరళ, బిహార్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌, జమ్మూ కశ్మీర్‌‌‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరి, జార్ఖండ్‌‌, మిజోరాం రాష్ట్రాలు చొరవ తీస్కొని వీటిని  నిషేధించినయ్‌‌.

ఎందుకు అట్రాక్ట్ అయితున్రు…

సిగరెట్‌‌తో పోలిస్తే.. ఇది చూడడానికి స్టైలిష్‌‌గా ఉంటది.  దీంట్లో వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లు సువాసన వెదజల్లుతయ్‌‌.  పొగ కూడా బయటకు రాదు. దీంతో వీటిని తాగేవాళ్లను గుర్తించడం కష్టం. మార్కెట్‌‌లో, ఆన్‌‌లైన్‌‌ ఈజీగా దొరుకుతున్నయ్‌‌.  ‘పొగతాగడం వల్ల ఎక్కువ మంది చనిపోతుండటంతో  ప్రజలు పొగతాగుడు తగ్గించున్రు. దీంతో టొబాకో ఇండస్ట్రీలు కొత్త దారులు వెతికినయ్‌‌. ఇ=సిగరెట్ల పేరుతో డేగలాగా చిన్న పిల్లలపై వాలుతున్నయ్‌‌” అని ‌‌క్యాన్సర్‌‌‌‌ కేర్‌‌‌‌ చైర్మన్‌‌ డాక్టర్‌‌‌‌ హరిత్‌‌ చతుర్వేది కామెంట్‌‌ చేసిండు.

వాళ్లంతట వాళ్లే తాగుతున్నరు…

స్మోకింగ్‌‌ అలవాటు నుంచి తప్పించడానికనే ప్రచారంతో ఇవి మార్కెట్‌‌లోకి వచ్చినయ్‌‌.  అయితే,  దీంట్లో కూడా నికోటిన్‌‌తో పాటు ఇతర కెమికల్స్ ఉంటయ్‌‌. కెమికల్‌‌ ఫ్లేవర్‌‌‌‌ నిజమైన సిగరెట్‌‌ తాగిన ఫీలింగ్‌‌ కలిగిస్తది. అయితే, ఇ –సిగరెట్లు మంచివనే ప్రచారం చెయ్యడం వల్లే ఒక ఏజ్‌‌ గ్రూప్‌‌ వాళ్లే తాగాలనేది పోయి.. ఎవరైనా తాగొచ్చనే భావన వచ్చింది. వీటిపై నిర్భంధం లేకపోవడంతో  టీనేజ్‌‌ లోపు పిల్లలు కూడా తాగటం మొదలు పెట్టిన్రు. ఇ– సిగరెట్‌‌ ఒరిజినల్‌‌ సిగరెట్‌‌ తాగేలాగా ప్రేరేపిస్తుంది. సిగరెట్‌‌ని తాగుడు తగ్గించాలనే ఉద్దేశంతో వచ్చిన ఇ–సిగరెట్.. ఒరిజినల్‌‌ సిగరెట్‌‌ అలవాటు చేసేలా మారింది.   సిగరేట్‌‌నే తాగొద్దు అని చెప్తున్నం. ఈ సిగరెట్‌‌ని కచ్చితంగా బ్యాన్‌‌ చెయ్యాలి. ఇందులో ఉండే నికోటిన్‌‌ కెమికల్స్‌‌  ఊపిరితిత్తుల పనితీరుని దెబ్బతీస్తయ్‌‌. ధీర్ఘకాలంలో క్యాన్సర్‌‌కు కూడా దారితీయొచ్చు.  పొగతాగేవాళ్లకు ఇ–సిగరెట్లు తాగమని ఏ డాక్టరూ సలహా ఇవ్వడు.