
న్యూఢిల్లీ: తాము ప్రయాణించిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిందని అలపుజ్జ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్కుదుపులకు గురైందని.. ప్రమాదం అంచులదాకా వెళ్లిన తమను కెప్టెన్ చాకచక్యంగా కాపాడాడని వెల్లడించారు. ఈ మేరకు తనకు జరిగిన భయానక అనుభవాన్ని వివరిస్తూ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. " ఆదివారం రాత్రి ఎయిరిండియాకు చెందిన ఏఐ 2455 విమానం తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో నాతోపాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు.
అప్పటికే విమానం ఆలస్యమైంది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాలిలో ప్లైట్ భారీ కుదుపులకు గురైంది. దీనివల్ల అందరం చాలా భయపడిపోయాం. ఓ గంట తర్వాత కెప్టెన్.. సిగ్నల్‌లో లోపం ఉందని ప్రకటించి, విమానాన్ని చెన్నైకి మళ్లించారు. పర్మిషన్స్ రాకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు ల్యాండింగ్ కోసం విమానాశ్రయం చుట్టూ తిరిగాం. అనుమతులు వచ్చాక విమానాన్ని రన్‌వేపై దింపేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ మరొక విమానం కనిపించింది.
గమనించిన కెప్టెన్ వెంటనే ల్యాండింగ్ ప్రాసెస్ అపేసి మళ్లీ విమానాన్ని పైకి తీసుకెళ్లాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఇక రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మేం కేవలం కెప్టెన్ నైపుణ్యం, అదృష్టంతోనే బతికి బయటపడ్డాం. కానీ, ప్రయాణికుల భద్రత అనేది అదృష్టంపై ఆధారపడకూడదు. ఈ ఘటనను వెంటనే విచారించి..ఇలాంటి లోపాలు మళ్లీ జరగకుండా చూడాలని డీజీసీఏ, పౌర విమానయాన శాఖను కోరుతున్నాను" అని ఎంపీ పేర్కొన్నారు.
రన్‌వేపై వేరే విమానం లేదు
ఎంపీ కేసీ వేణుగోపాల్ చేసిన ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. ఏఐ 2455 విమానం ల్యాండింగ్ టైంలో రన్‌వేపై మరో విమానం లేదని స్పష్టం చేసింది. ప్లైట్ మళ్లింపు వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. అయితే, తాము ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది.ఎయిర్ ఇండియా స్పందనపై కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. "రన్‌వేపై మరో విమానం ఉంది. అయినా ఎయిరిండియా అబద్ధం చెప్తున్నది. కెప్టెన్ చేసిన ప్రకటనలోనే అది స్పష్టమైంది. ఈ ఘటనపై డీజీసీఏతో మాట్లాడాం. విచారణ జరపాలని డిమాండ్ చేశాం" అని వెల్లడించారు.
దీనిపై బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.."ఇది చాలా తీవ్రమైన విషయం. రన్‌వేపై మరొక విమానం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వాదిస్తే, ఎయిరిండియా ఖండించింది. అంటే ఇద్దరిలో ఒకరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అర్థం. ఈ ఆరోపణ నిజమైతే చెన్నై ఏటీసీ, ఎయిరిండియా బాధ్యత వహించాలి. ఒకవేళ నిజం కాకపోతే వేణుగోపాల్ తదుపరి పరిణామాలు ఎదుర్కోవాలి. ఆయనను నో-ఫ్లై జాబితాలో చేర్చాలి" అని పేర్కొన్నారు.