ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీ ఆర్డినెన్స్ వ్యవహారంలో.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
  • కేంద్ర ఆర్డినెన్స్‌‌తో రాష్ట్ర సర్కార్‌‌‌‌కు హక్కులు లేకుండా పోతున్నాయని ప్రభుత్వ వాదన
  • కన్సల్టెంట్ల తొలగింపు నిర్ణయంపైనా స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ సివిల్ సర్వెంట్స్‌‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌‌ల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్ట్‌‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్ విషయంలో తమ అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించింది. ఢిల్లీలోని ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండేలా ప్రధాని మోదీ సర్కార్ ఇటీవల ఓ ఆర్డినెన్స్‌‌ తెచ్చింది. దీంతో ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్‌‌ చేస్తూ ఢిల్లీ సర్కార్‌‌‌‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌ను సోమవారం చీఫ్‌‌ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహన్‌‌ల బెంచ్ విచారణ జరిపింది. ఢిల్లీ సర్కార్ తరఫున సీనియర్ లాయర్‌‌‌‌ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 239(ఏఏ)ను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వానికి హక్కులు లేకుండా పోతున్నాయని, దీంతో కేంద్ర ఆర్డినెన్స్‌‌పై స్టే విధించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. 

అలాగే, ఢిల్లీ సర్కార్ నియమించిన 437 మంది కన్సల్టెంట్లను లెఫ్టినెంట్ గవర్నర్‌‌‌‌ (ఎల్జీ) తొలగించడంపైనా స్టే విధించాలని విజ్ఞప్తి చేయగా, కేంద్ర తరఫు సొలిసిటర్ జనరల్(సీజే) అభ్యంతరం తెలిపారు. కన్సల్టెంట్లను తొలగించడంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఈ అపాయింట్‌‌మెంట్లలో ఒక ఎమ్మెల్యే భార్య, మిగతా వారు ఆప్‌‌ పార్టీ కార్యకర్తలు ఉన్నారని వివరించారు. మధ్యలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.. కేంద్ర ఆర్డినెన్స్‌‌, కన్సల్టెంట్స్‌‌పై వచ్చే నెల 17న(సోమవారం) వాదనలు వింటామని చెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, ఈ పిటిషన్‌‌ను సవరించి లెఫ్ట్‌‌నెంట్ గవర్నర్‌‌‌‌ను ప్రతివాదిగా చేర్చాలని ఢిల్లీ సర్కార్‌‌‌‌ను ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. కాగా, ఆర్డినెన్స్‌‌కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల మద్దతును కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ నేతలు ఆందోళనలు కూడా చేశారు.