
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది అనేది ఓ సామెత. నిజంగా రైల్వేశాఖఅధికారులు ఎలుకలు పట్టుకోవటానికి అదే పని చేశారు. ఓ ఎలుక (Rat)ను పట్టడానికి ఎంత ఖర్చువుతుంది. మాములుగా అయితే వంద రూపాయిలు లేదంటే వెయ్యి రూపాయిలు. కానీ నార్తర్న్ రైల్వే (Northern Railway) లక్నో డివిజన్ అధికారులు ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి 41 వేల రూపాయిలు ఖర్చు చేసి ఔరా అనిపించుకున్నారు.
నీముచ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ (Chandrasekhar Gaur)అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు రైల్వే శాఖ స్వయంగా ఈ వివరాలు తెలియజేసింది. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ (Lucknow Division) 2020 నుంచి 2023 వరకు ఎలుకలను పట్టడం కోసం 69 లక్షల రూపాయిలకు పైగా ఖర్చు పెట్టింది.
పట్టిన ఎలుకలు ఎన్నయ్యా? అంటే కేవలం 168 ఎలుకలే. ఈ లెక్కలు చూసి ఎవరికైనా కళ్లు తిరగక మానదు. ఎలుకలు పట్టడం, చెదల నివారణ ఇవన్నీ ప్రాథమిక మెయింటెనెన్స్ కింద రైల్వే పరిగణిస్తుంటుంది. నార్నర్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ (Moradabad) డివిజన్లు ఉన్నాయి. చంద్రశేఖర్ గౌర్ నార్నర్ రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరగా.. ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది.
Also Read :- ప్రపంచంలోనే అతి చిన్న కెమెరా.. ఇసుక రేణువంత పరిమాణం..
మూడేళ్లలో 168 ఎలుకలను పట్టుకున్నామని తెలిపారు. ఎలుకల నియంత్రణ కోసం ఒక్కో ఏడాదికి రూ.23.2 లక్షలు చొప్పున మొత్తం 69 లక్షల రూపాయిలు ఖర్చు పెట్టామని రైల్వేశాఖ తెలిపింది. 2020లో 83, 2021లో 45, 2022లో 40 ఎలుకలను పట్టుకున్నట్లు పేర్కొంది.
కాని ఎలుకల కారణంగా జరిగిన నష్టం ఎంత? అన్న గౌర్ ప్రశ్నకు లక్నో డివిజన్ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్(Guds), వస్తువులకు సంబంధించిన సమాచారం లేదని తెలిపింది. అంబాలా డివిజన్ 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ఎలుకలు, చెదల నివారణకు ఏడాదికి లక్షల రూపాయిలు ఖర్చు చేసింది. ఉత్తర రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
అయితే ఉత్తర రైల్వే లక్నో డివిజన్ దీనిపై వివరణ ఇచ్చింది. ప్రతి ఏటా సుమారు 25 వేల రైలు కోచ్‌లలో ఎలుకలు, బొద్దింకలు, బెడ్‌బగ్‌లు, దోమల నియంత్రణకు చేపట్టిన అనేక రకాల పెస్ట్ కంట్రోల్ చర్యల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. అలాగే ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చు అని పేర్కొంది.