
యాదాద్రి, వెలుగు: తెలంగాణలో రాజకీయ ప్రయోజనం ఆశించే పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రధాని మోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఆరోపించారు. భువనగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.2 లక్షల చొప్పున బిచ్చమేసి వెక్కిరిస్తున్నారని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మికులకు హక్కులు లేకుండా చేశారని తెలిపారు.
కంపెనీలో ప్రమాదం జరిగి 40 మందికి పైగా కార్మికులు చనిపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిగాచి ఎండీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ చెప్పినట్టుగా చనిపోయిన ప్రతి కార్మికుడికి రూ. కోటి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను పూర్తి చేసి, సాగు తాగునీరు అందించాలని సూచించారు. యాదాద్రి జిల్లా ప్రజలకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని బస్వాపురం, గంధమల్ల ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య పాల్గొన్నారు.