
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- నృసింహుని సన్నిధిలో పూజలు
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగింటిని అమలు చేశామని, రానున్న రోజుల్లో మిగతా రెండింటితోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వందశాతం అమలు చేస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన ప్రెసిడెన్షియల్ సూట్ లో బస చేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రధానాలయంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అసమర్థత కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డులే కాకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రికి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మొక్క అందించి, స్వాగతం పలికారు.
ప్రధానాలయ ముఖ మంటపంలో మంత్రికి, విప్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో వెంకటరావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి, నారసింహుని ఫొటోను బహూకరించారు. డీసీసీ చీఫ్ సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ చైతన్యా మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి తదితరులున్నారు.