ఎక్కడికక్కడ నేతల నిర్బంధం

ఎక్కడికక్కడ నేతల నిర్బంధం

నిజామాబాద్/ నిజామాబాద్ క్రైమ్, వెలుగు: సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రతి పక్షనేతలు, స్టూడెంట్‌ లీడర్లు, యూనియన్‌ నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుంచే నిర్బంధించారు. సోమవారం ఉదయం నగరంలోని నాయకులు, వీఆర్ఏలను అరెస్టు చేశారు. గత 45 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలను అరెస్టు చేసి జానకంపేట్ ట్రైనింగ్ సెంటర్‌‌కు తరలించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టలోని టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి వెళ్తున్న కేసీఆర్‌‌ను అడ్డుకునేందుకు వెళ్తున్న పీడీఎస్‌యూ, పీవైఎల్ నాయకులను ఎల్లమ్మ గుట్ట వద్ద అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం వెళ్లే దారి పొడవునా ఉన్న షాపులను  మూసి వేయించారు. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సులన్నీ సభకు వెళ్లడంతో బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బైంసా నుంచి నిజామాబాద్ వైపు వచ్చే బస్సులను అర్ధాంతరంగా నిలిపివేశారు. పోలీసులను తప్పించుకుని సభలోకి వెళ్లిన కొందరు వీఆర్ఏలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇక సీఎం సభకు వచ్చిన కార్యకర్తలతో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. తెలంగాణ యూనివర్సిటీలో స్టూడెంట్‌ లీడర్లను ముందస్తు అరెస్ట్​ చేసి డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నవీపేట్‌ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్పీఎస్, సీపీఎం లీడర్లను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. బోధన్‌లో ఆదివారం రాత్రి అరెస్టుల పర్వం కొనసాగింది. బీజేపీ, కమ్యూనిష్టు పార్టీలకు చెందిన నాయకు కొలిపాక బాలరాజ్, మున్సిపల్​ ఫ్లోర్ లీడర్ మాసిని వివోద్​, మాజీ కౌన్సిలర్లు బొడ్డు రవి, రామరాజు, ధర్మపురి అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

ఎన్నికల హామీల ఊసేత్తని సీఎం
ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.200  కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. ఇది మినహా జిల్లాలోని ప్రధాన సమస్యలపై ఎలాంటి వరాలు ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని ప్రతిపక్షాలు రెండు రోజులుగా మీడియా ద్వారా డిమాండ్‌ చేశాయి. వంద రోజుల్లో నిజాంషుగర్స్ పునరుద్ధరణ, లెదర్ పార్క్, తెలంగాణ యూనివర్సిటీ, గల్ఫ్​ పాలసీ, ఇతర హామీల గురించి మూడు రోజుల కింద జరిగిన బీజేపీ ఎంపీ అర్వింద్ కూడా ప్రశ్నించారు. కానీ సీఎం కేసీఆర్‌‌ వాటి ఊసే ఎత్తలేదు.  

సీఎం సభలో ప్రొటోకాల్ రగడ  
సీఎం కేసీఆర్‌‌ బహిరంగ సభ వేదిక సాక్షిగా టీఆర్‌‌ఎస్‌ నేతల మధ్య వర్గపోరుకు బయట పడింది. సభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్ విఠల్‌రావు ఫొటో లేకపోవడంతో ప్రోటోకాల్​ చిచ్చురేగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి కావాలనే జడ్పీ చైర్మన్ ఫొటో పెట్టలేదని ఆయన వర్గీయులు మండిపడ్డారు. ఆర్మూర్ ఫ్లెక్సీల్లోనూ విఠల్‌రావు ఫోటో లేకపోవడంపై  వాగ్వివాదానికి దిగారు.మంత్రి జోక్యంతో ఫ్లెక్సీ లొల్లి తాత్కాలికంగా  సద్దుమణినా.. వీరిద్దరి  వర్గపోరుతో పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు 
వ్యక్తమవుతున్నాయి. 
 

అన్నా.. కానొచ్చిండా.. ! 

నిజామాబాద్ కలెక్టరేట్, టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్‌‌ను చూసేందుకు జనం ఆసక్తి చూపారు.. ఇక సభ ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులు సీఎంను చూసేందుకు పాట్లు అన్నీ ఇన్నీ కావు.. గోడ ఎత్తుగా ఉండడంతో ఇలా ఒకరిపై ఒకరు ఎక్కి సీఎంను చూశారు. 
- ‌‌ వెలుగు ఫొటోగ్రాఫర్‌‌, నిజామాబాద్‌ 

సీఎం పర్యటన సాగిందిలా..

  •     సీఎం కేసీఆర్‌‌ జిల్లా పర్యటన సందర్భంగా ఉదయం నుంచే జిల్లాలోని ప్రతిపక్ష, విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
  •     మధ్యాహ్నం 3.03 గంటలకు సీఎం కేసీఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌‌లో వచ్చారు.
  •     3.10 గంటలకు పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రెస్ క్లబ్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
  •     3.15 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు .
  •     3.40 గంటలకు రోడ్డు మార్గాన కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
  •     3.45 గంటలకు కొత్త భవనాన్ని ప్రారంభించారు. దాదాపు 30 నిమిషాలు కలెక్టరేట్‌ను పరిశీలించారు. 
  •     సీఎం రాక ముందు గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ధూంధాం స్థానికులను ఆకట్టుకుంది. 
  •     సీఎం రాకకు ముందు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, టీఆర్‌‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ప్రసంగించారు.
  •     4.15 గంటలకు గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
  •    స్టేజీ మీద ఏర్పాటుచేసిన పార్టీ జెండా ఆవిష్కరించి, అమర వీరల స్థూపానికి నివాళులర్పించారు.
  •     4.20 గంటలకు కేసీఆర్‌‌ ప్రసంగం ప్రారంభించి.. దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు.