- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
కోల్బెల్ట్, వెలుగు: క్షయ లక్షణాలను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెమడ పరీక్ష, ఎక్స్ రే తీసుకోవడం వల్ల క్షయ గుర్తించవచ్చని, సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పరీక్షలు, చికిత్స, అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. జిల్లాలో 759 మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి పోషకాహారానికి డీబీటీ ద్వారా రూ.6 వేల చొప్పున అందిస్తున్నామన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు కీలు ఫౌండేషన్ ద్వారా డాక్టర్రాజ్కిరణ్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందించారు.
ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పొన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్ రావు, డాక్టర్ సుధాకర్ నాయక్, తహసీల్దార్ సతీశ్, ఎంపీడీవో రాజేశ్వర్, వైద్యాధికారులు అరుణశ్రీ, రమేశ్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
