అఫ్గాన్​లో ​భూకంపం.. 2 వేల మంది సజీవ సమాధి

అఫ్గాన్​లో ​భూకంపం.. 2 వేల మంది సజీవ సమాధి
  • అఫ్గాన్​లో ​భూకంపం..2 వేల మంది సజీవ సమాధి
  • మరో 1,240 మందికి గాయాలు
  • రిక్టర్​ స్కేల్​పై 6.3 తీవ్రత నమోదు
  • ఊర్లకు ఊర్లే మట్టి దిబ్బలైనయ్​
  • 1,320 ఇండ్లు పూర్తిగా ధ్వంసం

కాబూల్ ​: అఫ్గానిస్తాన్ లో భూకంపం విధ్వంసం సృష్టించింది. ఊర్లకు ఊర్లనే నాశనం చేసింది. భారీ భూకంపంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. 2 వేల మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఇప్పటి వరకు 2,060 మంది చనిపోయారు. మరో 1,240 మంది గాయపడ్డారు. 1,320 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి” అని సమాచార మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ తెలిపారు.

కొన్ని గ్రామాలైతే పూర్తిగా నాశనమయ్యాయని, జనం శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, శనివారం పశ్చిమ అఫ్గానిస్తాన్ లో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. 

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. 

అఫ్గానిస్తాన్ లో గత 20 ఏండ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్​లో తీవ్ర నష్టం వాటిల్లింది.  పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. శిథిలాల కింది నుంచి డెడ్ బాడీలను, గాయపడిన బాధితులను రెస్క్యూ సిబ్బంది తీసుకొస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ చిన్నారి మెడ వరకు శిథిలాల కింద కురుకుపోగా, రెస్క్యూ సిబ్బంది రక్షించారు. 

రెస్క్యూ ఆపరేషన్​లో ఎన్జీఓలు.. 

సహాయక చర్యల్లో మిలటరీతో పాటు ఎన్జీవోలు కూడా పాల్గొంటున్నాయి. యూఎన్ మైగ్రేషన్ ఏజెన్సీ, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రెసెంట్ సొసైటీ తదితర సంస్థలు బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నాయి.

క్రికెటర్​ రషీద్ ఖాన్ పెద్ద మనసు.. 

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. భూకంప బాధితులను ఆదుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్​ల ద్వారా వచ్చే ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు డొనేట్ చేస్తానని ప్రకటించారు. అలాగే త్వరలోనే ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా ప్రారంభిస్తానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, అఫ్గాన్ కు అండగా ఉంటామని పాకిస్తాన్, చైనా ప్రకటించాయి. అఫ్గానిస్తాన్ అధికారులతో టచ్​లో ఉన్నామని, అవసరమైన సాయం అందిస్తామని తెలిపాయి.