ఈ చలికాలంలో డాండ్రఫ్ వదిలించుకునే సింపుల్ మార్గాలు

ఈ చలికాలంలో డాండ్రఫ్ వదిలించుకునే సింపుల్ మార్గాలు

కాలుష్యం, టెన్షన్, శరీరం తీరు.. కారణం ఏదైనా కొంతమందిలో తల నిండా డాండ్రఫ్ పట్టేసి.. ఎంతకీ వదలదు. ఎన్ని రకాలైన షాంపులు, రెమిడీలు వాడినా ఫలితం ఉండదు. దాని వల్ల జుట్టు కూడా రాలిపోతుంటుంది. ఇదో కొత్త తలపోటుగా మారిపోతుంది. అయితే శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల ప్రాడక్ట్ వాడినప్పుడు కొందరికి బెటర్ రిజల్ట్ వస్తుంది. కానీ, ఈ చలికాలంలో మళ్లీ డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంటుంది. దీన్ని వదిలించుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలను చూద్దాం.

రోజూ ఆయిల్ పెట్టుకోవడం

ఈ సీజన్‌లో చర్మం డ్రైగా మారిపోతుంది. మాడుకి సరిపడా తేమ అందదు. దీంతో పెచ్చుల్లా మళ్లీ డాండ్రఫ్ వస్తుంది. ఆ డ్రైనెస్‌ను కంట్రోల్ చేస్తే కొంతమేర ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనికి బెస్ట్ వే తలకు రోజూ ఆయిల్ పెట్టుకోవడమే. రోజూ కుదరని పక్షంలో కనీసం తలస్నానం చేసే కొన్ని గంటల ముందుగానైనా ఆయిల్‌తో బాగా మర్దన చేసుకోవడం మంచిది. అలాగే మరీ వేడి నీళ్ల స్నానం చేస్తే చర్మం మరింత పొడిగా మారిపోతుంది. సో, గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడుకోవడం మంచింది.

క్యాప్ వాడితే మేలు

పొల్యూషన్, చలి వాతావరణం నుంచి తలను కాపాడుకోవడం మంచిది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పడు తప్పనిసరిగా క్యాప్ లాంటివి వాడి కవర్ చేసుకోవడం మేలు. అమ్మాయిలైతే స్కార్ఫ్ లాంటి కట్టుకోవచ్చు. దీని ద్వారా డాండ్రఫ్ నుంచి కాపాడుకోవడంతో పాటు జలుబు లాంటి వాటి బారినపడకుండా కూడా చూసుకోవచ్చు.

హోం రెమిడీస్..

డాండ్రఫ్‌ని వదిలించుకునేందుకు షాపుల్లో కొన్న షాంపూలు, ఆయిల్స్ కంటే ఇంటి చిట్కాలే మేలు. కొంచెం కొబ్బరి నూనె తీసుకుని దాన్ని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కర్పూరం పొడి చేసి వేయాలి. దాన్ని బాగా మిక్స్ చేసి.. తలస్నానం చేసే ముందు కుదుళ్లకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మార్పు సులభంగా గమనించవచ్చు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా డాండ్రఫ్ సమస్య వదలకపోతే స్కిన్ డాక్టర్‌ను కలిసి, ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది.