రోడ్డెక్కిన నడిగడ్డ సీడ్ పత్తి రైతులు..మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్

రోడ్డెక్కిన నడిగడ్డ సీడ్ పత్తి రైతులు..మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్

అయిజ, వెలుగు: అయిజ–గద్వాల రోడ్డుపై బింగిదొడ్డి స్టేజి వద్ద బుధవారం సీడ్ పత్తి రైతులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు వారికి మద్దతు తెలిపారు. 30 ఏండ్లుగా నడిగడ్డలో 40 మంది ఆర్గనైజర్లు 35 వేల మంది సీడ్ రైతులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. సీడ్ పత్తి క్రాసింగ్ దశకు చేరుకున్న తరుణంలో ఎకరాకు 2 క్వింటాళ్ల  సీడ్ మాత్రమే తీసుకుంటామని, లేకపోతే పంటను తొలగిస్తే పరిహారంగా ఎకరాకు  రూ.10 వేలు ఇస్తామని ఆర్గనైజర్లు చెబుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. 

ఇప్పటికే ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేశారని, పంట తొలగించుకుంటే ఎకరాకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పండిన పంటను మొత్తం కొనుగోలు చేయాలన్నారు. గద్వాల డీఎస్పీ మొగిలయ్య, తహసీల్దార్ జ్యోతి, ఏవో జనార్ధన్, సీఐ టాటా బాబు వచ్చి, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ తో ఫోన్​లో మాట్లాడగా.. గురువారం కలెక్టరేట్ లో సీడ్ కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రామచంద్రారెడ్డి, గోపాలకృష్ణ, గొంగళ్ల రంజిత్ కుమార్, లవన్న, నగేశ్​తదితరులు పాల్గొన్నారు.