ఓటమి భయం లేకపోతే.. ఇంతమంది ఎందుకు?

V6 Velugu Posted on Aug 25, 2021

హుజురాబాద్ లో ఓడిపోతే పోయేదేమీలేదన్న కేటీఆర్.. మరి అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్కడ ఎందుకు దించారో చెప్పాలి అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కేసీఆర్ కు దిక్కులేక ఓట్ల కోసం దళితబంధు తీసుకొచ్చాడని ఆయన అన్నారు. జమ్మికుంటలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఈటల పై వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ ఉన్నారు.

‘సీఎంతో జరిగిన మీటింగ్ లో హుజురాబాద్ ప్రస్తావన రాలేదని కేటీఆర్ చెబుతున్నారు. ఓడిపోతే తమ ప్రభుత్వం కూలిపోదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ మూడు నెలలుగా కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి, హరీశ్ రావు సిద్ధిపేట గెస్ట్ హౌస్ నుంచి, ఇతర మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజల మీద తోడేళ్లు పడ్డట్టు ఎందుకు పడుతున్నారు. సొంత పార్టీ నాయకులకు, ప్రజాప్రతనిధులకు ఖరీదు కట్టి ఎన్ని చిల్లర పనులు చేయాలో అన్నీ చేశారు. చివరకు గతిలేక, గత్యంతరం లేక దళితుల మీద మొదటిసారిగా వారికి ప్రేమ పుట్టుకువచ్చింది. దళితుల ఓట్లపై ప్రేమతో దళిత బంధు తెచ్చారు. నా రాజీనామా వల్ల హుజురాబాద్ ప్రజానికానికి ఎన్నో లాభాలు జరిగాయో... అవన్నీ ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇవ్వాలని అడుగుతున్నా. ఇండియా టుడే సర్వేలో సీఎం ప్రతిష్ఠ 84 శాతం తగ్గిపోయిందని, క్రెడిబులిటీ లేని సీఎం అని ప్రకటించారు. హుజురాబాద్ లో సర్వే చేయించుకుంటే.. దళితబంధు రాజేందర్ వల్లే వస్తుందని దళితప్రజలే చెప్పారు. ఈటల వల్లే ఈ పథకాలు వస్తున్నాయని.. అందుకే ఈటలకే ఓటేస్తామని చెప్పినట్లు సర్వే రిపోర్టులు వస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసినా.. టీఆర్ఎస్ ఓటమి నిర్ణయమై పోయిందని వారికి రిపోర్టులు అందాయి. ఓటమి భయంతోనే నిన్న కేటీఆర్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు

గతంలో తాను లేకుండానే ఉపఎన్నిక గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన సీఎం.. ఇప్పుడు హుజురాబాద్ లో ప్రతి మండలానికి వస్తాడట. ఇప్పటికే ఎంపీటీసీలతో, జెడ్పీటీసీలతో మూడు నాలుగు సార్లు ప్రగతి భవన్ లో మీటింగులు పెట్టాడు. సిద్ధిపేట మంత్రి ఇక్కడే అడ్డాపెట్టాడు. ఇక్కడి నాయకులపై ఎంతో అపనమ్మకమో చూడండి. ఇంత నీచపు బతుకు బతుకుతూ, ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం ఇక్కడి నాయకులకు ఉందా? ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల తర్వాత మీ నాయకుల ముఖం ఎవరైనా చూస్తారా? హుజురాబాద్ ఎన్నికల తర్వాత.. ఎక్కడి నాయకులు అక్కడే ఉంటారు. మిమ్మల్ని పట్టించుకునేవాడు ఉండడు. సీఎం ప్రతిష్ట దిగజారిన తర్వాత.. వీళ్లంతా కనుమరుగు కాకతప్పదు. తలకిందకు, కాళ్లు మీదకు పెట్టినా తెలంగాణలో ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ నాయకులను మళ్లీ గెలిపించే ప్రసక్తే లేదు . ఇప్పటికైనా నాయకులు మరోసారి ఆలోచించుకోవాలి. ఇంటిలిజెన్స్ రిపోర్టుల్లో, ఏజెన్సీలు చేసిన సర్వేల్లోనూ ఓటు ఈటలకే వేస్తామని ప్రజలు చెబుతున్నారు. ప్రేమకు ఇక్కడి ప్రజలు లొంగుతారు తప్ప, బెదిరిస్తే లొంగరు.

నా విజయం తర్వాత తెలంగాణలో పెనుమార్పులు వస్తాయి

ఇప్పటికే నియోజకవర్గంలో 200 కోట్లు ఖర్చు చేశారు. ఓటుకు 20 వేలు ఇస్తారట. ప్రతిరోజు దావత్ లు పెడుతున్నారు. ఇక్కడి ప్రజలకు దావతుల పేరిట మద్యం అలవాటు చేస్తన్నారు. ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా ప్రలోభాలు, చిల్లరపనులు ఆపాలి. ప్రజాస్వామ్యం మీ పనులు చూసి సిగ్గుపడుతోంది. ఈటల రాజేందర్ గెలిస్తే.. తెలంగాణ ఆత్మగౌరవం గెలిచినట్లని ప్రజలు భావిస్తున్నారు. నా విజయం తర్వాత తెలంగాణలో పెనుమార్పులు వస్తాయి. నేను రాజీనామా చేస్తేనే ఇన్నొచ్చాయి... గెలిస్తే పేద ప్రజల గొంతునవుతా. నేను గెలిస్తే దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అంతమవుతాయి. తెలంగాణకు స్వేచ్ఛ వస్తుంది. ప్రజల ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆకలి కేకలు లేని సుసంపన్నమైన తెలంగాణకు పునాదీ నా విజయంతో పడుతుంది. రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్ఠ మళ్లీ పెరుగుతుంది. అబద్ధపు ప్రచారాలు, నీచపు కుట్రలను, ప్రలోభాలని చీల్చి చెండాడేందుకు ప్రజలంతా కథానాయకులు కావాలి. మీరే నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. టీఆర్ఎస్ వాళ్లకు ఇంకా దింపుడుకల్లం ఆశ మాత్రమే మిగిలింది’ అని ఈటల అన్నారు.

Tagged Bjp, TRS, Telangana, KTR, POLITICS, Eatala Rajender, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News