20 ఏండ్లుగా పోరాటమే.. కేసీఆర్ పాలనకు గోరీ కడ్తం

20 ఏండ్లుగా పోరాటమే.. కేసీఆర్ పాలనకు గోరీ కడ్తం

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి పోరుబాట పట్టారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు గోరీ కట్టడమే తన ఎజెండా అని ప్రకటించారు. లక్ష్య సాధన కోసం లెఫ్ట్ రాజకీయ నేపథ్యం నుంచి రైట్ పార్టీలో  చేరారు. రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో తెంచేసుకున్నారు. ఈటల రాజకీయ జీవితంలో ఎక్కువ రోజులు ఆందోళనలు, అలజడులు, ఉద్యమాలతోనే గడిచిపోయాయి. ఇప్పుడు మరోసారి అదే బాటను ఎంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న సమయంలో పీడీఎస్ యూ రాష్ట్ర నేతగా పని చేసిన ఆయన పెండ్లి తర్వాత పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించారు. వ్యాపారం బాగా సాగుతున్న సమయంలోనే టీఆర్ఎస్ లో చేరారు. వ్యాపారంలో వచ్చిన డబ్బులను పార్టీకి ఖర్చు చేసి కష్టకాలంలో టీఆర్ఎస్ ను ఆదుకున్నారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా మారారు.  

అవమానాలకు కుంగిపోలే.. ప్రలోభాలకు లొంగిపోలే    

అసెంబ్లీలో టీఆర్ఎస్ పక్ష నేతగా మొదటి నుంచీ ఈటల రాజేందరే బాధ్యతలు మోశారు. అప్పటి సీఎంలు వైఎస్ రాజేశఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణవాదాన్ని హేళన చేసినా,  అవమానించినా కుంగిపోలేదు. 2004లో తొలిసారిగా కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి, తెలంగాణ పక్షాన మాట్లాడే గొంతుకగా మారారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పటి సీఎం వైఎస్ ప్రలోభాలకు లొంగిపోయి కారు దిగి కాంగ్రెస్ లో చేరితే ఈటల లొంగిపోలేదు. తర్వాత కాంగ్రెస్  ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉన్నా వైఎస్ తో తెలంగాణ కోసం కొట్లాట మానలేదు. ఎన్నికల ఫలితాల గురించి అసెంబ్లీలో వైఎస్ మాట్లాడుతూ.. ‘‘50 సీట్లలో పోటీ చేస్తే పట్టుమని10 సీట్లు గెలవలే రాజేంద్రా.. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతుందా.. రాజేంద్రా?’’ అని అవమానించినా కుంగిపోలేదు. ఈటలను పర్సనల్ గా టార్గెట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ ను అమాంతం ఆయన సొంత భూమిలో నుంచే వెళ్లేలా చేసి బెదిరింపులకు దిగినా సీమాంధ్ర సీఎంకు లొంగిపోలేదు. నమ్ముకున్న తెలంగాణవాదాన్ని విడిచిపెట్టలేదు. 

అసెంబ్లీలో ముందుండి కొట్లాడిండు 

రోశయ్య సీఎం అయ్యాక అసెంబ్లీలో జరిగిన అనేక చర్చల్లో తెలంగాణవాదాన్ని ఈటల గెలిపించారు. పదునైన ఉపన్యాసాలతో అసెంబ్లీని ఆలోచింపజేశారు. ఉద్యమం జోరందుకునే నాటికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణకు నిధుల విషయంలో ఈటల వేసిన ప్రశ్నలకు కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమివ్వలేక ఫ్రస్టేషన్ కు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ‘ఇగ రాసి పెట్టుకో.. ఒక్క రూపాయి కూడా ఇయ్యం. ఏం చేసుకుంటావో చేసుకో’ అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తే.. ‘తక్షణమే సీఎం క్షమాపణ చెప్పాలి’ అంటూ ఈటల ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం రానిచ్చేది లేదంటే.. ‘రాష్ట్రం నీ అయ్య జాగీరా’ అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన రోజు నుంచే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం నుంచి మొదలుకొని స్పీకర్ చాంబర్ ఎదుట ఆందోళనలు, వాకౌట్ల వరకూ అన్నింట్లోనూ ఈటల ముందుండి కొట్లాడారు.   

వెయ్యి మంది అమరుల పాడె మోసిండు  

తెలంగాణ ఉద్యమ సమయంలో గుండె పగిలి, రాష్ట్రం రాదేమోనని సుమారు 2 వేల మంది ఆత్మ బలిదానం చేసుకున్నరు. రాష్ట్రంలో ఏ మూలన ఆత్మార్పణం జరిగినా టీఆర్ఎస్ తరఫున వారి అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబాలకు ఈటల ధైర్యం చెప్పారు. ఏనాడూ కేసీఆర్ ఇల్లు కదలకపోయినా టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఈటలనే రాష్ట్రమంతా పర్యటించారు. సుమారు వెయ్యి మంది అమరుల అంతిమయాత్రల్లో పాల్గొని వాళ్ల పాడెలను భుజాన మోశారు.

 
టీఆర్ఎస్ ఉద్యమ పంథాను మార్చిన నేత   

తెలంగాణ ఉద్యమం అంటే రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు వెళ్లడం వరకే అన్నట్లుగా సాగేది. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఈటలే ఆందోళనబాట పట్టించారు. మిలియన్ మార్చ్, సాగర హారం, మానుకోట ప్రతిఘటన, రైల్ రోకోలు, సకల జనుల సమ్మె, రాస్తారోకోలు, వంటావార్పుల్లాంటి ఉద్యమాలు వాస్తవానికి కేసీఆర్ కు ఇష్టం లేనివని అనేకసార్లు నాటి జేఏసీ సారథి కోదండరాం చెప్తారు. జేఏసీ నిర్ణయాలు కేసీఆర్ కు ఇష్టం లేకున్నా ఈటల రాజేందరే కన్విన్స్ చేసి ఒప్పించారు. విద్యుత్ సౌధ ఎక్కి అప్పట్లో చేసిన ఆందోళన సంచలనం సృష్టించింది. 48 గంటల ఉప్పల్ రైలురోకో ఘటన, మానుకోట రైల్వే స్టేషన్ కు జగన్ ను రాకుండా చేసిన ఆందోళనలో ఈటల కీలక పాత్ర పోషించారు.  

గులాబీ జెండా ఓనర్ల ప్రకటనతో సంచలనం   

పెన్షన్లు, రైతు బంధులాంటి పథకాలతో పేదరికం పోదని, ప్రజలకు కావాల్సింది పంట అని, పరిగె కాదని పలుమార్లు సంక్షేమ పథకాల్లోని డొల్లతనాన్ని ఈటల విప్పిచెప్పారు. ఉద్యమ ద్రోహులు తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ లో చేరి మంత్రులుగా పెత్తనం చెలాయించడాన్ని సహించలేకపోయారు. గులాబీ జెండాకు నిజమైన ఓనర్లం తామేనని ఉద్యమకారుల పక్షాన ప్రకటించారు. నియంతృత్వం రాజ్యమేలుతున్న చోట, ఆత్మగౌరవం దక్కని చోట పని చేయడం కన్నా రాజీనామా చేయడం మేలని భావించిన ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.