అపోజిషన్ లీడర్లతో  ఈటల భేటీలు

అపోజిషన్ లీడర్లతో  ఈటల భేటీలు

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ వివిధ రాజకీయ పార్టీల సీనియర్ నేతలతో వరు స భేటీలు జరుపుతున్నారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన సీనియర్ నేతల వద్ద కు ఆయన వెళ్తూ,  రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. సలహాలు, సూచ నలు తీసుకుంటున్నారు. 

మొన్నటి దాకా నియోజకవర్గ నేతలతో
కేబినెట్​ నుంచి బర్తరఫ్ కు గురైన తర్వాత ఈటల తన నియోజకవర్గం హుజురాబాద్ లో మూడు రోజుల పాటు ఉన్నారు. అక్కడే తన అనచరులు, ముఖ్య నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన..  హుజురాబాద్ కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ, మండల స్థాయి నాయకులను తన నివాసానికి పిలిపించుకొని సమావేశమయ్యారు. 

పలువురి మద్దతు
ఇటీవల శామీర్ పేటలోని తన నివాసంలోనే రెండు, మూడు రోజులు గడిపిన ఈటల రాజేందర్​ను పలువురు నాయకులు కలిసి మద్దతు ప్రకటించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్​పర్సన్​ తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. 

ఇతర పార్టీల నేతలను కలుస్తూ..
మూడు, నాలుగు రోజుల నుంచి ఈటల రాజేందర్​ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల వద్దకు వెళ్తూ వారితో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఒకప్పటి ఉద్యమ సహచరుడు, మండలి మాజీ చైర్మన్​, బీజేపీ నేత స్వామి గౌడ్, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలను ఆయన కలుస్తూ వారితో తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ  స్టేట్  చీఫ్  బండి సంజయ్ ని కూడా కలిసినట్లు ఈటల రాజేందర్​ చెప్తుండగా.. వారు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. 

సస్పెండ్​ చేసే వరకు ఆగాలని..
టీఆర్ఎస్ హైకమాండ్ తనను సస్పెండ్ చేసే వరకు వేచి చూడాలనే ఆలోచనతో ఈటల రాజేందర్​ ఉన్నట్లు ఆయన వర్గంలో ప్రచారం జరుగుతోంది. పార్టీ పెట్టే విషయంలో ఆయన స్పష్టత ఇవ్వనప్పటికీ, కాంగ్రెస్, బీజేపీ నేతలతో భేటీ అవుతున్న సందర్భంలో ఆ పార్టీల నేతలు మాత్రం తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో వారికి ఈటల రాజేందర్​ ఎలాంటి హామీ ఇవ్వనట్లు తెలిసింది.

ఉప ఎన్నిక వస్తే సపోర్ట్​ కోసమేనా?
ఒకవేళ హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బీజేపీ, కాంగ్రెస్ సపోర్టు కోసమే ఆ పార్టీల నాయకులతో ఈటల రాజేందర్​ సమావేశమవుతున్నట్లు  చర్చ సాగుతోంది. అయితే తమవి జాతీయ పార్టీలు అయినందున నిర్ణయం తమ చేతిలో ఉండదని ఆయనకు ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈటల కూడా ఆ పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాతనే పార్టీ పెట్టడమా..? బీజేపీ, కాంగ్రెస్ రెండింటిలో ఏదైనా పార్టీలో చేరడమా? అనేది ఈటల రాజేందర్​  నిర్ణయించుకుంటారని ఆయన వర్గం అంటున్నది. మొత్తానికి ఈటల గత మూడు రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ల వద్దకు వెళ్లి కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా ఇంకొంత మంది  వివిధ పార్టీల, ఇతర రంగాలకు చెందిన ముఖ్య నేతలను కలువనున్నట్లు ఈటల వర్గం చెప్తోంది.