నన్ను పార్టీ నుంచి బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు

నన్ను పార్టీ నుంచి బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు
  • ఉపఎన్నికతో కొత్త కార్డులు, పింఛన్లు వస్తయని ఆశపడుతున్నరు
  • ప్రాణముండగా నన్ను బొందపెట్టాలని చూశారు
  • ఎమ్మెల్యేల్లారా.. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి
  • ఎమ్మెల్యేలు గెలిచింది నా నియోజకవర్గం మీద దాడి చేయడానికి కాదు
  • మీడియా సమావేశంలో ఈటల


మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నుంచి సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌లో పర్యటిస్తున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా బుధవారం ఇల్లందకుంటకు చేరుకున్నారు. స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మండలకేంద్రంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

‘నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యేగా 17 నుంచి 18 సంవత్సరాల పాటు ఉంటూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాను. పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తర్వాత.. మీ రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ మళ్లీ వస్తాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఫించన్లు ఆగిపోయాయని.. ఈ ఎన్నికల వల్లనైనా వస్తాయని సంబరపడుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నవాళ్లకు కూడా ఓట్ల కోసం కొత్త కార్డులిస్తారని అంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డులు, ఫించన్లకు దరఖాస్తులకు వెంటనే తీసుకోవాలి. గతంలో ఇచ్చిన హామీ మేరకు 58 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఫించన్ రిలీజ్ చేయాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.  హుజురాబాద్ ఎన్నికల ఓట్లకోసమైనా రిలీజ్ చేయండి. హుజురాబాద్‌ను జిల్లా చేయడంతో పాటు.. వావిలాల, చల్లూరును మండలాలుగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. గ్రామాల్లో, మండలాల్లో నిధులు లేక మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు నిర్వీర్యమయ్యాయి. ఒక్కో మండలానికి పది కోట్లు, ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల నిధులు ఇవ్వాలి. గతంలో అన్ని పంచాయితీలు, మండల పరిషత్తులు, జెడ్పీటీసీలు గెలిపించుకున్నాం. భార్యాభర్తలను, పిల్లలను విడదీసినట్లు... మా నాయకులను, కార్యకర్తలను వేరుచేస్తున్నారు. ఇది నీచమైన చర్య. ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తోంది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు కొత్తగూడెం నుంచి వికారాబాద్ వరకు ఈటల నియోజకవర్గంపై మిడతల దండులాగా దాడి చేస్తున్నారు. వర్ధన్నపేట, పరకాల, ఇతర ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లేసింది మా నియోజకవర్గం మీద దాడి చేసేందుకు కాదు. రాజభక్తిని చాటుకోవాలంటే చాటుకోండి. బానిసలుగా బతకాలనుకుంటే బతకండి. కానీ నామీద మీ ప్రతాపం చూపాలని చూస్తే.. అంతకంటే ఎక్కువగా స్పందిస్తాం. 

గాలి వస్తేనో, ట్రెండ్ వస్తేనో గెలిచినోన్ని కాదు 


2008లో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 అసెంబ్లీ సీట్లు గెలిస్తే అందులో నేను కూడా ఉన్నాను. 2009లో 50 సీట్లలో పోటీ చేస్తే 10 మాత్రమే గెలిచారు. అందులో హుజురాబాద్ కూడా ఒకటి. ఎవరి ఇమేజ్‌తోనో, ట్రెండ్‌తోనే గెలవలేదు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ఓడినా... అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా హుజురాబాద్ నుంచి 50 వేల మెజార్టీ ఇచ్చిన ఘనత ఇక్కడి వాళ్లది. ప్రజలు, మేము ఒకరికొకరు అల్లుకుని ఉన్నాం. పచ్చని సంసారంలో చిచ్చుబెట్టాలని ప్రయత్నిస్తే ఖబడ్తార్. నేను పార్టీ పెడుతున్నానని, వేరే పార్టీకి వెళ్తున్నాని ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారలేదు. మీరే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు. ప్రాణముండగా నన్ను బొందపెట్టాలని చూశారు. ఆ బొందలో మీరే పడుతారు. ప్రలోభాలు పెట్టి నేను ఏనాడు గెలవలేదు. మీ ప్రలోభాలు మా ప్రజలు చూస్తున్నారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేద్దామనుకుంటే పొరపాటు. మా ఉద్యోగులు మీ ఆటలు సాగనీయరు. పోలీసు స్టేషన్ల్లో అధికార దుర్వినియోగం చేసి మా వాళ్లను వేధించాలని చూస్తున్నారు. పోలీసులకు ఆ ఉద్దేశం లేకున్నా పైవారి ఆదేశాల ప్రకారం మనసు చంపుకుని చేస్తున్నారు. 

ఈటల గెలవాలని ఉద్యోగులు, పోలీసులు, యువకులు కోరుకుంటున్నారు 

ఈటల గెలవడమంటే తమను తాము గెలిపించుకోవడమనుకుంటున్నరు. నాలాంటోడు మాట్లాడితేనే ఏమేం వచ్చాయో అందరికీ తెలుసు. ధాన్యం కొనే శక్తి రైసు మిల్లులకు లేదని.. కొనుగోలు కేంద్రాలని పెట్టాలని నేనే డిమాండ్ చేశాను. కొంత మంది చెంచాగాళ్లు, డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లతోని కరపత్రాలు, పోస్టర్లు అంటించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అలాంటివేవీ నా దగ్గర నడవవు. 2018లో నా ఓటమి కోసం నా ప్రత్యర్థికి డబ్బులిచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను భయపడలేదు. ఏడు నెలల కాలం నన్ను కేబినెట్‌లోకి తీసుకోకపోయినా భరించాను. నన్ను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ ప్రజలు దాన్ని గమనించారు. హుజురాబాద్‌లో ధర్మయుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. ధర్మయుద్ధంలో పాండవులు గెలిచినట్లుగా... హుజురాబాద్‌లో ధర్మమే గెలుస్తుంది. ఎన్నికలు వస్తే ఇంటికో మనిషి నాకు సంఘీభావంగా వస్తారు. ఇతర జిల్లాల నుంచి కూడా నాకు మద్దతుగా ఫోన్లు చేస్తున్నారు. పిడికెడు మంది నాయకులు వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కర్రుకాల్చి ప్రజలు వాత పెట్టడం ఖాయం. దమ్ముంటే ప్రజాస్వామికంగా పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయాలి’ అని ఆయన అన్నారు.