ఇంటెలిజెన్సోళ్లు ఓటర్లను బెదిరిస్తున్నరు

ఇంటెలిజెన్సోళ్లు ఓటర్లను బెదిరిస్తున్నరు
  • హుజూరాబాద్​లో వంద మందికి పైగా ఎందుకున్నరు?: ఈటల 
  • టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని పనిచేయండి.. ఇంటెలిజెన్స్ చీఫ్​ పై ఫైర్ 
  • ఓట్ల కోసమే కేసీఆర్​కు ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చింది
  • రాష్ట్రంలో దళితులకు తీరని అన్యాయం 
  • గెలుపు కోసం సీఎం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడని విమర్శ 

జమ్మికుంట, వెలుగు: “మీరు చట్టానికి లోబడి పని చేస్తున్నారా..  చుట్టానికి లోబడి పని చేస్తున్నారా.. ఏ ప్రాతిపదికన వంద మందికి పైగా ఇంటెలిజెన్స్ వాళ్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు?  మా కార్యకర్తలు కలిసిన ఓటర్లను వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్లు కలిసి బెదిరిస్తున్నారు. మీరు రాజకీయ కార్యకర్తల్లా గులాబీ చొక్కాలు వేసుకోండి.. కండువాలు కప్పికొండి. కానీ మీరు తీసుకునే జీతాలు ప్రజలు కష్టపడితే వచ్చిన డబ్బులని గుర్తుంచుకోండి” అని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీజేపీ ఆఫీసులో బుధవారం ఈటల మీడియాతో మాట్లాడారు.

ఓట్ల కోసం ప్రగతి భవన్ వీడి.. 
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే తమకు పుట్టగతులుండవని సీఎం కేసీఆర్​కు ఇప్పుడు తెలిసొచ్చిందని ఈటల విమర్శించారు. తాను రాజీనామా చేసిన తర్వాత ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి వస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకొస్తోందన్నారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడు వైద్యం ఉచితంగా అందించాలని కోరినా.. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. తాను బయటికి వచ్చిన తరవాత ఇప్పుడు సీఎం వచ్చి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కట్టిస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు. 

దళితులకు ఏం చేశావ్.. ? 
తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న కేసీఆర్.. ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా లాక్కున్నాడని ఎద్దేవా చేశారు. దళితులు పాలించేందుకు అర్హులు కాదని అవమానించారన్నారు. సీఎంవోలో దళిత ఐఏఎస్ అధికారులకు అవకాశం ఉందా అని ప్రశ్నించాడు. ఇప్పుడున్న మంత్రులు దళితులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిచాల్సింది పోయి సీఎంకు వంత పాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 16 శాతం ఉన్న  దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి. 0.5 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయని ఈటల ప్రశ్నించారు. మాదిగ, మాలలు మంత్రి పదవులకు అర్హులు కాదా అన్నారు. సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన ఐఏఎస్​లు ఉన్నారు. ఈ జాతులు పనికి రావా? ఈ జాతులకు ఆ నైపుణ్యం లేదా అని ప్రశ్నించారు. భూపాలపల్లి కలెక్టర్​గా ఎంతో గొప్పగా పని చేసిన మంచి వ్యక్తిని అక్కడి నుంచి తీసివేసి ఎక్కడో వేస్తే ఆయన పదవిని వదిలిపెట్టి పోయారన్నారు. ధరణి పేరుతో తీసుకు వచ్చిన చట్టంతో ఎన్నో ఏండ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని మళ్లీ దొరలకు అప్పజెప్పిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.  

ప్రజల నుంచి నన్ను విడదీయలేరు
డబుల్ బెడ్రూమ్​లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​లో మాత్రమే కట్టి ఇచ్చారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు నిర్మించలేదని ఈటల ప్రశ్నించారు. సీఎం చెప్పిందే వేదం తప్ప, మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదన్నారు. ప్రస్తుతం హుజూరాబాద్​కు వస్తున్న మంత్రులు నిధులు, ఇండ్లు ఇస్తామని చెప్తున్నారని.. మరి మొత్తం రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పి గెలవాలనేదే కేసీఆర్ నైజమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని, కర్రుకాల్చి వాత పెడతారని అన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే, ధర్మం గెలుస్తుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల నుంచి తనను విడదీయలేరని పేర్కొన్నారు.