606 రిజెక్ట్.. 2898 నామినేషన్లు ఓకే

606 రిజెక్ట్.. 2898 నామినేషన్లు ఓకే
  • 606 రిజెక్ట్.. 2898 నామినేషన్లు ఓకే
  • గజ్వేల్ లో 13, కామారెడ్డిలో 6 తిరస్కరణ
  • మేడ్చల్ సెగ్మెంట్ లో 38 మంది ఔట్
  • సిరిసిల్లలో నిల్.. సిద్దిపేటలో రెండు
  • చెన్నూరులో 6, సిర్పూర్ లో 14
  • స్క్రూటినీ తర్వాత లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 606 నామినేషన్లను రిజెక్ట్ చేసినట్టు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా మేడ్చల్ సెగ్మెంట్ లో 38 మంది నామినేషన్లు రిజెక్టయ్యాయి. 119 నియోజకవర్గాలకు 4798 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 606 రిజెక్ట్ కావడంతో 2,898 మంది బరిలో మిగిలారు. రేపటితో ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఎంత మంది బరిలో నిలుస్తారో తేలనుంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో 127 మంది నామినేషన్లు వేశారు. వారిలో 13 మంది నామినేషన్లు రిజెక్టయ్యాయి. 114 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది.

 కేసీఆర్ పోటీ చేస్తున్న మరో సెగ్మెంట్ కామారెడ్డిలో ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ 64 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిరస్కరణల అనంతరం 58 మంది బరిలో నిలిచారు. మరో కీలక నియోజకవర్గం సిరిసిల్ల.. ఇక్కడి నుంచి మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ 23 మంది నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ దాఖలైన అన్ని నామినేషన్లను ఈసీ అంగీకరించింది.

మంత్రి హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్దిపేటలో 38 నామినేషన్లు దాఖలు కాగా.. రెండు రిజెక్టయ్యాయి. ఇందులో 36 ఆమోదం పొందాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్ లో మొత్తం 15 నామినేషన్లు దాఖలు కాగా.. ఒకటి రిజెక్టయ్యింది. దీంతో అక్కడ 14 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 23 నామినేషన్లు దాఖలవగా.. ఆరు రిజెక్టయ్యాయి. ఇందులో 17 మంది నామినేషన్లు ఓకే అయ్యాయి. 

గజ్వేల్, మేడ్చల్ లోనే భారీ పోటీ

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో 114 మంది నామినేషన్లకు ఈసీ ఆమోదం లభించింది. మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నుంచి 108 నామినేషన్లు దాఖలవగా.. ఇందులో 38 తిరస్కరణకు గురయ్యాయి. 67 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. చెన్నూరు సెగ్మెంట్ లో 30 నామినేషన్లు దాఖలు కాగా ఆరింటిని అధికారులు తిరస్కరించారు. 24 మంది బరిలో నిలువనున్నారు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్న సిర్పూర్ లో 31 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ 14 తిరస్కరణకు గురయ్యాయి. 17 మంది నామినేషన్లకు అధికారులు అంగీకారం తెలిపారు. 

సెగ్మెంట్   తిరస్కరణ    అంగీకారం

గజ్వేల్            13                  114    
మేడ్చల్         38                  67
కామారెడ్డి        06                  58
ఎల్బీ నగర్    05                   57
మునుగోడు    01                   50
సిరిసిల్ల         నిల్                23
సిద్దిపేట        02                   36
కొడంగల్       01                  14
మధిర           06                   17
సిర్పూర్        14                  17
చెన్నూరు     06                   24