8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లు

8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లు

న్యూఢిల్లీ, వెలుగు:  లోక్​సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 8  రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) 17 మంది స్పెషల్ అబ్జర్వర్లను నియమించింది. ఇందులో ఏపీకి ముగ్గురు పరిశీలకులను నియమిస్తూ మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‌‌‌‌జనరల్ స్పెషల్ అబ్జర్వర్ గా మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా, పోలీస్ స్పెషల్ అబ్జర్వర్​గా మాజీ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్​కు బాధ్యతలు అప్పగించింది. 

అలాగే ఎన్నికల వేళ పలు రాష్ట్రాల్లో నిఘా పెంచడంతో పాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ధన ప్రభావం, కండ బలం, తప్పుడు సమాచారం తదితర అంశాలపై దృష్టి సారిస్తారిని వెల్లడించింది. ఏడు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, యూపీ, మహారాష్ట్రతోపాటు బీహార్‌‌‌‌కు పరిశీలకులను పంపుతున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సైతం అబ్జర్వర్ల సేవలు వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. ఏపీ, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా కోసం ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపింది.