ఎన్నికలకు రెడీగా ఉండండి!

ఎన్నికలకు రెడీగా ఉండండి!

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన అన్ని బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్​(సీఈఓ)కు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్టం చేసింది. ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. సాధారణ పరిస్థితులంటూ ఇప్పటికిప్పుడు ఏ రోజును తేల్చి చెప్పలేమని, అన్ని వ్యవస్థలు నడుస్తున్నట్లుగానే ఎన్నికలు కూడా జరగాలని తెలిపింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో  బై ఎలక్షన్స్‌తో పాటు వచ్చే ఏడాది మరో 5 రాష్ట్రాలకు జనరల్ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే కరోనా కేసులు వస్తున్నా, పరిస్థితులకు అనుగుణంగా పకడ్బందీగా రూల్స్ ను అమలు చేస్తూ ఎన్నిక లు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మెజార్టీ రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ఓకే చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందని సీఈఓ కార్యాలయ వర్గాలు చెప్తున్నయి. పార్టీలు, క్యాండిడేట్ల ప్రచారంపై ఆంక్షలు విధించాలని ప్లాన్ రూపొందిస్తున్నరు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, అప్పీల్స్ వంటివి ఆన్​లైన్​లో నిర్వహించడంపై ఈసీ కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఈసీ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. ఇందుకు సోమవారం నాటితో గడువు ముగిసింది.