తెలంగాణ ఎన్నికల్లో టిప్​టాప్ ​పోలింగ్​ స్టేషన్లు

తెలంగాణ ఎన్నికల్లో టిప్​టాప్ ​పోలింగ్​ స్టేషన్లు
  • రాష్ట్రంలో 1309 ప్రత్యేక పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఈసీ
  • నియోజకవర్గానికి ఐదు చొప్పున మహిళల కోసమే ప్రత్యేకం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఈసీ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుడుతోంది. విస్తృతంగా టెక్నాలజీని వాడుకోవడంతో పాటు పోలింగ్​ స్టేషన్లనూ ఆకట్టుకునేలా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా1200 పోలింగ్​ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు వాటిని ప్రత్యేక స్టేషన్​లుగా గుర్తించనున్నారు. గతంలో మహిళల కోసం పింక్​ పోలింగ్​కేంద్రాలను ఈసీ మొదలు పెట్టింది.


అప్పుడు చాలా తక్కువ సంఖ్యలో నియోజకవర్గానికి ఒకటి మాత్రమే పరిమితం చేయగా ఈసారి ఆ సంఖ్యను 5కు పెంచింది. ఇలా ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం 5 మహిళా పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 595 స్పెషల్​ఉమెన్ పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో కేవలం మహిళా ఓటర్లను మాత్రమే అనుమతిస్తారు. మహిళా అధికారులు విధులు నిర్వహిస్తారు. ఇప్పటికే డ్రాప్ట్​ ఓటర్ల జాబితా ప్రకారం పురుషులు, మహిళల ఓటర్ల జాబితాను ఎనలైజ్​చేసి.. ఎక్కడ మహిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఉమెన్​పోలింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 

ఐదు చొప్పున మోడల్​ పోలింగ్ స్టేషన్లు

పోలింగ్ శాతం పెంచేందుకు.. మోడల్​పోలింగ్​స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటిని కూడా ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున 595 మోడల్​పోలింగ్​స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఎంపిక ప్రక్రియను ఎన్నికల అధికారులు మొదలుపెట్టారు. ఇతర పోలింగ్​స్టేషన్లకు భిన్నంగా వీటిని తీర్చిదిద్దనున్నారు. సాధారణంగా గ్రామాల్లో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్​కేంద్రం, పట్టణ ప్రాంతాల్లో 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్​స్టేషన్​ ఏర్పాటు చేస్తున్నారు.  ప్రత్యేక అవసరాలు కలిగిన ఓటర్ల కోసం కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్​ఏర్పాటు చేసే ప్లాన్​చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాకు అనుగుణంగా 34,891 పోలింగ్​స్టేషన్లు ఉన్నాయి. ఈ సంఖ్య 35 వేలకు చేరనుంది. 

ఈసీ పర్యటనకు అన్ని  రెడీ చేస్తున్నాం : వికాస్​రాజ్​

కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈఓ వికాస్​రాజ్​తెలిపారు. అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ పర్యటన ఉందని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుందన్నారు. మరణించిన వారితో పాటు బోగస్ ఓట్లు కలిపి 8 లక్షల ఓట్లు తొలగించినట్లు చెప్పారు.