సాక్ష్యాలు సమర్పించండి.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు

సాక్ష్యాలు సమర్పించండి.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో మోసం జరిగిందని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది. గురువారం బెంగళూరులో ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ పవర్‌‌‌‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ‘‘ఓటు చోరీ’’ జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కర్నాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ఆదివారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. 70 ఏళ్ల శకున్ రాణి రెండు నెలల వ్యవధిలో ఫారం -6 ఉపయోగించి రెండుసార్లు ఓటరుగా నమోదు చేసుకుని, రెండుసార్లు ఓటు వేసినట్లు రాహుల్ ఆరోపించారు.

ఈ ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. శకున్ రాణి ఒక్కసారి మాత్రమే ఓటేసిందని, ఈ విషయం స్వయంగా ఆమె చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. రాహుల్ చూపించిన టిక్ మార్క్‌‌‌‌తో కూడిన డాక్యుమెంట్ పోలింగ్ అధికారి జారీ చేసినది కాదని సీఈవో విచారణలో తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని రాహుల్‌‌‌‌ను సీఈవో  కోరారు, తద్వారా వివరణాత్మక విచారణ జరపవచ్చని తెలిపారు.

ఈసీపై పెరుగుతున్న ఒత్తిడి

బీజేపీ, ఈసీ కుమ్మక్కై ఎన్నికల్లో మోసం చేస్తున్నాయనే రాహుల్ ఆరోపణలు.. బిహార్‌‌‌‌లో ఓటర్ల జాబితా రివిజన్​(సర్)​వివాదం, ఓటు చోరీ ఆరోపణలతో ఈసీపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాహుల్ ఆరోపణలు ‘‘నిరాధారం, తప్పుడు” అని ఈసీ విమర్శించింది. సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఓటరు జాబితా అందించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ, అవి అందలేదని రాహుల్ చేసిన వ్యాక్యలపై అఫిడవిట్ సమర్పించాలని లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.