లోక్​సభ ఎన్నికలకు..అధికారులు రెడీ

లోక్​సభ ఎన్నికలకు..అధికారులు రెడీ
  •     రెగ్యులర్ ​డ్యూటీతో పాటు ఏర్పాట్లలో బీజీ
  •     ఈవీఎం మిషన్లను పరిశీలిస్తున్న ఈసీఐఎల్​ టీమ్​
  •     పోలింగ్​ సెంటర్లలో సౌలత్​ల పరిశీలన
  •     పొలిటికల్​ లీడర్లకు కొత్త ఓటర్​లిస్ట్​ అందజేత
  •     కమిషన్​ నిబంధనల మేరకు ఆఫీసర్ల ట్రాన్స్​ఫర్

నిజామాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​నాటికి ముఖ్యమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్న కమిషన్​ ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు సన్నద్ధమవుతున్నారు. వారం రోజుల నుంచి రెగ్యులర్​ విధులతో పాటు ఎలక్షన్​ సంబంధ డ్యూటీలో నిమగ్నమయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీగా బదిలీలు 

ఎలక్షన్​ కమిషన్ ​ఆదేశాల మేరకు జిల్లాలో మూడేండ్ల సర్వీస్​ పూర్తయిన ఆఫీసర్లను, జిల్లా స్థానికత ఉన్నవారిని ట్రాన్స్​ఫర్ ​చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఒక్కో శాఖ నుంచి ట్రాన్స్​ఫర్​ఆర్డర్లు వెలువడుతున్నాయి. ఇద్దరు అడిషనల్​కలెక్టర్లు, జిల్లా పరిషత్​సీఈవో, డీపీవో, డీఆర్డీవో, పోలీస్​శాఖకు చెందిన జిల్లా అడిషనల్​ డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఎక్సైజ్​శాఖ డిప్యూటీ కమిషనర్లు, ఇద్దరు మున్సిపల్ ​కమిషనర్లతో కలిపి సుమారు 25 మందిని ట్రాన్స్​ఫర్ ​చేశారు. 

జిల్లాకు చెందిన 20 మంది ఎంపీడీవోలను నిర్మల్, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్​జిల్లాలకు పంపి, అక్కడి వారిని జిల్లాకు ట్రాన్స్​ఫర్​చేశారు. పోలీస్​శాఖలో కీరోల్​ పోషించే 14 మంది స్పెషల్ బ్రాంచ్​ ఇన్​చార్జులకు స్థానచలనం కల్పించారు. మరో రెండు రోజుల్లో కొందరు ఎస్ఐలను బదిలీ చేయనున్నారు. దాదాపు ప్రతీ కీలక శాఖకు కొత్త ఆఫీసర్లు వచ్చారు.

ఈవీఎంల చెకింగ్​​

జిల్లాలో 1,549 పోలింగ్​సెంటర్ల ​ఏర్పాటుకు కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతు ఆమోదం తెలిపారు. సెంటర్లలో తాగునీరు, టాయిలెట్స్​ఇతర సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోసం 2,916 బ్యాలెట్​యూనిట్లు, 1,752 కంట్రోల్​యూనిట్లు, 2,373 వీవీ ప్యాట్​లు అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈసీఐఎల్​నుంచి వచ్చిన 17 మంది  ఇంజినీర్ల టీమ్​వీటి పనితీరును పరిశీలిస్తోంది. 

ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న ఫస్ట్​ లెవల్​ చెకింగ్​70 శాతం ముగిసింది. ఓటింగ్​మిషన్లను మరో రెండు రోజుల్లో రెడీ చేస్తారు. మరో పక్క మాక్​ పోలింగ్​ఏర్పాటుకు ఏరియాలు నిర్ణయించిన ఆఫీసర్లు, ఎన్నికల నిర్వహణపై  ట్రైనింగ్​ఇచ్చేందుకు మాస్టర్ ​ట్రైనర్లను సెలెక్ట్​ చేశారు.

లోక్​సభ ఓటర్ల లిస్ట్​ రెడీ

బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్​లోని ఆరు మండలాలు నిజామాబాద్​ జిల్లాలో భాగంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతను కమిషన్​ ఇందూర్​ఆఫీసర్లకు అప్పగించింది. బాన్సువాడ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతో కలిపి ఈ నెల 8న కొత్త ఓటర్​లిస్ట్​ను ప్రకటించారు.

 జిల్లాలోని పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో 7,42,475 మంది మహిళా ఓటర్లుండగా, 6,64,238 పురుష ఓటర్లు, 72 మంది ఇతరులు ఉన్నారు. 85 మంది ఓటర్లు విదేశాల్లో ఉన్నారు. మొత్తం 14,06,785 మంది ఓటర్లుగా లెక్క తేల్చారు. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే తాజాగా 40,974 మంది ఓటర్లు కొత్తగా యాడయ్యారు. అధికారులు కొత్త ఓటర్​లిస్ట్​ను అన్ని పొలిటికల్ పార్టీలకు అందజేశారు.