
చెన్నై: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై డీఎంకే తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ను ఎదుర్కోవడం చేతకాకే వారి పేర్లను చార్జిషీటులో చేర్చారని డీఎంకే ట్రెజరర్, పార్లమెంటరీ పార్టీ లీడర్ టీఆర్ బాలు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది సిగ్గుమాలిన ప్రతీకార చర్య అని ఆదివారం ఆయన ఫైర్ అయ్యారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిక్షాలను కాంగ్రెస్ పార్టీ ఏకం చేస్తున్నదని, ఆ కడుపు మంటతోనే ఈడీ వంటి సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతున్నదని ఆరోపించారు. సోనియా, రాహుల్ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై డీఎంకే తరపున ఖండిస్తున్నామని తెలిపారు.