- బలవంతంగా వసూలు చేసిన రూ.19.39 కోట్లు ఫ్రీజ్
- రుణాలు ఇచ్చి వేధింపులకు గురిచేసిన నిర్వాహకులు
హైదరాబాద్, వెలుగు: లోన్ యాప్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ యాప్ ల ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసిన రూ.19.39 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. లోన్ యాప్ కంపెనీల ఫిక్స్ డ్ డిపాజిట్లను సీజ్ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈడీ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా లోన్ యాప్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, తక్షణ రుణాల పేరుతో లోన్ ఇస్తూ అధిక మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజ్, వడ్డీ వసూలు చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించని వారికి వివిధ రకాల చార్జీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందులో ఆన్‌లైన్ లోన్, రూపియా బస్, ఫ్లిప్ క్యాష్, రూపే స్మార్ట్ వంటి యాప్ లు ఉన్నాయి. నిమిషా ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కైలైన్ ఇన్నొవేషన్ టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వాటిని నిర్వహిస్తున్నారు.
Also Read:-అడవుల జిల్లాలో అందాల జలపాతాలు
ఆ యాప్ లకు చైనీస్ డైరెక్టర్లుగా ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. మొబైల్ యాప్ ల లింక్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రుణాలు ఇస్తున్నారు. స్కైలైన్ ఇన్నొవేషన్ రాజ్‌కోట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ లిమిటెడ్ ఆ యాప్ ల కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రక్రియలో మొత్తం రూ. 20 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి” అని రోహిత్ ఆనంద్ వివరించారు. మరోవైపు, లోన్ యాప్ లపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా118 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో 242 ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌గా పోలీసులు గుర్తించారు.