‘పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌’పై ఈడీ దాడులు

 ‘పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌’పై ఈడీ దాడులు
  • బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్న ‘పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌’
  • బ్యాంకులను మోసం చేసిందని కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు
  • రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ కంపెనీలపైనా ఈడీ సోదాలు

ఢిల్లీ : బ్యాంకుల్ని మోసం చేసి వేల కోట్ల రుణాలు తీసుకున్న ఓ సంస్థకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మూడు సీక్రెట్ లాకర్ల నుంచి భారీగా బంగారం కడ్డీలు, వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.47 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల అంచనా. 

పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్లు రుణాలు తీసుకొని మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. 2018లో పరేఖ్‌ అల్యూమినెక్స్‌ లిమిటెడ్‌ కంపెనీపై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ అనే కంపెనీలపైనా తాజాగా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. రక్షా బులియన్‌ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించినట్టు ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ప్రైవేటు లాకర్లను తెరిచిన ఈడీ అధికారులు వాటిలో ఉన్న బంగారం, వెండిని చూసి షాక్‌ అయ్యారు. నిబంధనలు పాటించకుండా లాకర్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 761 లాకర్లు ఉండగా.. మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు తెలిపారు. ఆ మూడు లాకర్లను తెరిచి చూడగా.. రెండు లాకర్లలో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188 కిలోల వెండి ఉందని వివరించారు. వీటి విలువ సుమారు రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్‌ చేశారు.