
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని ఈ రోజు ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న ఈడీ... కొద్ది సేపటి క్రితమే విచారణ ముగించింది. ఈ రోజు ఉదయం రామచంద్ర పిళ్లైని హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. లిక్కర్ కేసులో ఆయన పాత్రపై పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
రాబిన్ డిక్షనరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో లింకులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ పెద్దలకు రామచంద్ర పిళ్లై పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండో స్పిరిట్ తో పాటు కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రూ.2 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ఈడీ లిక్కర్ కేసులో రామచంద్ర పిళ్లైని 14వ నిందితుడిగా చేర్చింది.