
- ఐదో రోజూ రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ
- ఇప్పటి వరకు 50 గంటలకు పైగా విచారించిన అధికారులు
- రేపు విచారణకు హాజరుకానున్న సోనియా
న్యూఢిల్లీ: వరుసగా ఐదో రోజు కాంగ్రెస్ లీడర్ రాహుల్‌గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ అధికారులు రాహుల్‌ను మరోసారి ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.15 గంటలకు రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సుమారు పది గంటల పాటు రాహుల్‌ను అధికారులు విచారించారు. రాహుల్ విచారణ నేపథ్యంలో ఈడీ హెడ్‌క్వార్టర్స్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మొత్తంగా రాహుల్ గాంధీ ఐదు రోజుల్లో 50 గంటల పాటు ఈడీ ఆఫీసులో ఉన్నారు. పలు దఫాలుగా ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నించి.. ఆయన స్టేట్మెంట్స్ను రికార్డు చేసుకున్నారు. గత వారం వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గతవారం విచారణ తర్వాత ఆయన తల్లి సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్నందున కాస్త విరామం తీసుకునేందుకు అనుమతించారు. అయితే సోనియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో సోమవారం నుంచి మళ్లీ విచారణను తిరిగి ప్రారంభించారు. సోమవారం అర్ధరాత్రి వరకు రాహుల్‌ను అధికారులు విచారించారు. మంగళవారం కూడా విచారణకు రావాలని, స్టేట్మెంట్ను పూర్తి చేయాలని కోరడంతో ఆయన ఈడీ ఆఫీసుకు మరోసారి వచ్చారు. మరోవైపు గురువారం తమ ఎదుట హాజరుకావాలంటూ సోనియా గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.